హైదరాబాద్, నవంబర్ 11, (నమస్తే తెలంగాణ): పరిధి దాటి రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పదంగా మారిన గవర్నర్ తమిళిసై తాజాగా తన భాషా దురహంకారాన్ని కూడా చాటుకున్నారు. తెలుగు మాట్లాడటం తప్పు, తెలుగు మూలాలు ఉండటం నేరం అన్నట్టుగా ఆమె ఇటీవల చెన్నైలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కాక పుట్టిస్తున్నాయి. ఆమె ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఉద్దేశించి ‘తెలుగు మూలాలు ఉండి, ఇంట్లో ఆ భాష (తెలుగు) మాట్లాడుతూ బయట తమిళ వేషం వేస్తారు’ అని వ్యాఖ్యానించారు. ‘తాను తమిళియన్‌గా తెలంగాణ అసెంబ్లీలో ‘తిరుక్కురల్’ను (తమిళ సాహిత్య చరిత్రలో ఒక ఇతిహాసం) ధైర్యంగా ప్రస్తావించా..’ ‘తనలా నిజమైన తమిళ రక్తం ప్రవహించే వారి వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారు’ అని పేర్కొన్నారు.
స్టాలిన్ కుటుంబం తెలుగు మూలాలు కలిగి ఉండటమే పెద్ద తప్పు అయినట్టూ, వారి ఇంట్లో తెలుగు మాట్లాడమే పెద్ద అపరాధం అన్న అర్థం వచ్చేలా తమిళిసై చేసిన వ్యాఖ్యలను తెలగాణవాదులు, తెలుగువారు తప్పుబడుతున్నారు. గవర్నర్ పదవిలో ఉండి ఇలా మాట్లాడటం ఏమిటని ముక్కున వేలేసుకుంటున్నారు. తమ పూర్వీకులు తెలుగువారనీ, ఆంధ్ర ప్రాంతం నుంచి తమిళనాడులోని తంజావూర్‌కు వలస వచ్చారని, తమ ఇంట్లో తెలుగు మాట్లాడతారని గతంలో స్టాలిన్ తండ్రి, మాజీ సీంఎ కరుణానిధి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే స్టాలిన్‌పై ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రభుత్వం పంపిన 21 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి పెండింగ్‌లో పెట్టిన నేపథ్యంలో డీఎంకే, దాని మిత్రపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి. రవిని రీకాల్ చేయాలని డీఎంకే, దాని మిత్రపక్షాలు రాష్ట్రపతికి రాసిన లేఖలో డిమాండ్ చేశాయి.
ఈ అంశంతో తనకు సంబంధం లేకపోయినా తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందిస్తూ, ప్రజాస్వామ్యంలో గవర్నర్‌కు ఉన్న అధికారాలను ప్రశ్నిస్తారా? అని వ్యాఖ్యానించారు. దీనిపై డీఎంకే అధికారక పత్రిక ‘మురసోలి’.. తమిళిసై వ్యాఖ్యలను తప్పుబట్టింది. దీంతో తాను గవర్నర్‌గా కాకుండా తమిళనాడు పౌరురాలిగా స్పందించానని, గవర్నర్‌గా ఉన్నంత మాత్రాన మాట్లాడే భావ స్వేచ్ఛ ఉండదా? అని ఆమె ఎదురుదాడికి దిగారు. దీనిపై మురసోలి పత్రిక మరింత ఘాటుగా స్పందిస్తూ.. ‘తెలంగాణ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే పొగడలేక, తమిళనాడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. తన పరిధి దాటి ఒక రాజకీయ నాయకురాలిగా మాట్లాడుతున్నార’ని మండిపడింది. ‘అక్కడే కాదు, మీ (తమిళిసై) పప్పులు ఇక్కడా ఉడకవు’ అని మురసోలి గట్టి కౌంటర్ ఇవ్వడంతో స్టాలిన్‌పై తమిళిసై తన అక్కసు వెళ్లగక్కారు.
తెలుగు, తమిళ ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్ర గవర్నర్ తమిళిసై గారూ!
తమరు, తెలంగాణ నేలపై జీవిస్తూ, తెలంగాణ ప్రజల నుంచి జీతం పొందుతూ, ఇకడి తిండి తింటూ, ఇకడి నీరు తాగుతూ, ఇకడి గాలి పీల్చుతూ తమిళ భాష మాట్లాడొచ్చట. కానీ, స్టాలిన్ మాత్రం తెలుగు మాట్లాడకూడదట. మీకొక నీతి, స్టాలిన్‌కు మరొక నీతా? మీ గురివింద నీతిని తెలంగాణ ప్రజలు సహించరు. తెలుగు, తమిళ ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్రలకు తెరలేపిన మీరు గవర్నర్‌గా కొనసాగే అర్హతను కోల్పోయారు. రాజకీయాలు చేయాలనుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. రాజీనామా చేసి ప్రజా రాజకీయాల్లో నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు. కానీ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజకీయాల్లో తలదూర్చడం సరికాదు. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై కండ్లలో నిప్పులు పోసుకునే పద్ధతిని మానుకుంటే మంచిది.
– మంత్రి శ్రీదేవి, అధికార భాషాసంఘం అధ్యక్షురాలు
తెలుగుపై విద్వేషమా?
రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రథమ పౌరురాలిగా తమిళిసైపై ఉన్నది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తుల మాటలు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండకూడదు. వ్యక్తి స్వేచ్ఛకు, రాజ్యాంగ బాధ్యతలకు మధ్య ఉండే సున్నితరేఖను అతిక్రమించకుండా ఉండటం ఏ స్థాయి వారికైనా అవసరం. గవర్నర్‌లాంటి పదవుల్లో ఉన్నవారిపై ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ఉద్వేగాలతో పనిచేయకూడదు. తెలుగు మూలాలు ఉన్నాయని అవమానించడం మానుకోవాలి. తెలుగు మాట్లాడటమే తప్పు అన్న భావన వచ్చేలా గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించడం తప్పు, తగదు కూడా.
– జూలూరు గౌరీశంకర్, తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్