రాహుల్‌గాంధీ హామీకి మూడేండ్లు.. 2 లక్షల ఉద్యోగాలు ఏమాయె?
‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏటా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. నెలకు రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. మళ్లీ వస్తా.
- ఏటా భర్తీ చేస్తామని అశోక్‌నగర్‌కు వచ్చి మరీ చాయ్పేచర్చ
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖం చాటేసిన అగ్రనేత
- ఇయర్ క్యాలెండర్లు మారినా పత్తాలేని జాబ్ క్యాలెండర్
- హామీల ఎగవేతపై భగ్గుమంటున్న తెలంగాణ నిరుద్యోగులు
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏటా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. నెలకు రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. మళ్లీ వస్తా. మిమ్మల్ని కలుస్తా’ సరిగ్గా మూడేండ్ల క్రితం అంటే 2023 నవంబర్ 25వ తేదీన ఇదేరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హైదరాబాద్‌లో నిరుద్యోగులకు ఇచ్చిన భరోసా. హైదరాబాద్ నగరం నడిబొడ్డున అశోక్‌నగర్‌లోని ఓ టీ కొట్టు సాక్షిగా నిరుద్యోగ యువతతో స్వయంగా ముచ్చటిస్తూ హామీ ఇచ్చారు. నాడు రాహుల్‌గాంధీ ఇచ్చిన ఆ హామీకి బుధవారంనాటితో మూడేండ్లు గడిచింది. కానీ, ఈ మూడేండ్లలో ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకాలేదు.
నాడు తాము పిలువకుండానే వచ్చిన రాహుల్‌గాంధీ ఈ మూడేండ్లలో ఒక్కసారి కూడా హామీల అమలు గురించి పట్టించుకోకపోవడంపై తెలంగాణ నిరుద్యోగ యువత భగ్గుమంటున్నది. గత ఎన్నికల ముందు అశోక్‌నగర్‌లో ప్రత్యక్షమైన రాహుల్‌గాంధీ.. కారు దిగి నడుచుకుంటూ వచ్చి, చాయ్ తాగుతూ నిరుద్యోగుల సమమ్యలు విన్నారు. నిరుద్యోగులతో ముచ్చటించారు. కొండంత భరసానిచ్చారు. తెలంగాణ నిరుద్యోగ యువత కలలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన మాటలు నమ్మిన యువత కాంగ్రెస్‌కు మద్దతునిచ్చింది. కానీ ఇప్పుడదే అశోక్‌నగర్‌లో ఉద్యోగాలేవీ? జాబ్ క్యాలెండర్ అమలేదీ? రెండు లక్షల ఉద్యోగాలెప్పుడిస్తారు? అంటూ ఈ మూడేండ్లుగా యువత ఆందోళనలు చేస్తుంటే పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు.
మూడేండ్లలో 23 మంది నిరుద్యోగుల ఆత్మహత్య
2023లో నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య చేసుకొంటే.. పిలువకుండానే రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌లో వాలిపోయారు. ఈ మూడేండ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 23 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, బాధిత కుటుంబాలకు, నిరుద్యోగు యువతకు భరోసానిచ్చేందుకు ఇప్పుడు రాహుల్ ఎందుకు రావడంలేదని యువత ప్రశ్నిస్తున్నది. అసలు అశోక్‌నగర్‌కు వచ్చి భరోసానిచ్చిన విషయం అసలు గుర్తుందా? లేక తమ అవసరం తీరిందని తమతో ఇక పనిలేదని వదిలేశారా? అని నిరుద్యోగ యువత నిలదీస్తున్నది.
అనాడు ఓట్ల కోసం అశోక్‌నగర్‌కు వచ్చిన రాహుల్ ఇదేరోజు రమ్మంటే.. మా గోడు వినమంటే ఎందుకు రావడంలేదని నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. 2024 ఆగస్టు 2న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టారు. మొత్తం 15 రకాల నోటిఫికేషన్లతో దానిని విడుదల చేశారు. ఏడాదిలో నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాలను భర్తీచేస్తామని హామీ ఇచ్చారు. ఆఖరుకు ఆ క్యాలెండర్ గడువు కూడా ముగిసినా దానిలో ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు.
రాహుల్మాస్కులతో నిరుద్యోగుల నిరసన
చిక్కడపల్లి, నవంబర్ 25: రాహుల్.. రెండు లక్షల ఉద్యోగులు ఎక్కడ? అంటూ నిరుద్యోగులు ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నిరుద్యోగులతో చాయ్ తాగి మూడేండ్లు అవుతున్న సందర్భంగా శుక్రవారం చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాహుల్ గాంధీ మాస్కులు ధరించి ‘రాహుల్ గాంధీ దోలాక్ నౌకరి దియేంగే.. రాహుల్ జీ చాయ్ పీయేంగే’ అంటూ నినాదాలు చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తమను మోసం చేసిన రాహుల్ గాంధీకి నిరుద్యోగులతో కలిసి చాయ్ తాగే దమ్ముందా అని ప్రశ్నించారు.
70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ నాయకులు తమతో ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఎన్నికల్లో మెగా డీఎస్సీ హామీ ఇచ్చారని, ఆ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని అన్నారు. తక్షణమే ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేదంటే రాబోయే రోజుల్లో నిరుద్యోగుల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాథోడ్, గోపినాథ్, గణేశ్ రాథోడ్, నరేశ్, సురేశ్, వేణు, అనిల్, సవాయ్ సింగ్, రవి, లక్ష్మణ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ జీ జవాబ్ దో
రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమాధానం చెప్పి తీరాలి. ఆనాడు మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు మరికొన్ని మోసాలకు తెరలేపుతున్నది. మ్యానిఫెస్టో హామీల అమలు లేనేలేదు. మెగా డీఎస్సీ పత్తాలేదు. రెండు లక్షల ఉద్యోగాల హామీ ఒక అబద్ధం. నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి పచ్చి మోసం. ఇచ్చే అరకొర నొటిఫికేషన్లకు ఫీజులు పిండుతున్నారు. కానీ, నిరుద్యోగులకు ఉద్యగవకాశాలు మాత్రం కల్పించడం లేదు.
– అస్మా, నిరుద్యోగ జేఏసీ నేత
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తాం
రాహుల్‌గాంధీ నాడు ఇచ్చిన హామీల అమలుకు లంకె బిందెలు అవసరం లేదు. రాజ్యాంగాన్ని పట్టుకొని మాట్లాడే రాహుల్‌గాంధీ ఆయన స్వయంగా ఇచ్చిన హామీల అమలుపై సొంత పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. రాహుల్ హామీకి ఇప్పటికి మూడేండ్లు పూర్తయింది. ఇక మా ఓపిక నశించింది. నిరుద్యోగుల సత్తా చూపుతాం. ప్రత్యేకంగా నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తాం. డిసెంబర్ మూడో వారం నుంచి రెండు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తాం. కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి తీరుతాం.
– జనార్దన్, నిరుద్యోగ జేఏసీ నేత
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తాం (2023 నవంబర్ 25న రాహుల్ ట్వీట్)
‘హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతను కలిశాను. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ యువతకు న్యాయం జరుగలేదు. 30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయింది. వారు కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణలోనే వారికి కొలువులు రాని దుస్థితి. అందుకే వారి కలలు సాకారమయ్యేలా.. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జాబ్ క్యాలెండర్‌ను వారికి చూపించి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 2 లక్షల నియామకాలను పూర్తిచేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం’
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

