నిర్భయానికి నిలకడ తోడైతే..
ఒక క్రికెటర్ రికార్డుల జాబితా ఎంత పెద్దగా ఉన్నా, ఆటలో నిలకడ అనేది అత్యంత కీలకం.
భారత యువ సంచలనం, 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ దోహా మైదానంలో భారీ షాట్లతో బంతులను బౌండరీ లైన్ దాటిస్తుంటే సోషల్ మీడియాలో, టీవీ తెరలపై అతని పేరు మారుమోగింది. 53 బంతుల్లో 204 పరుగులు బాది లిస్ట్-ఎ క్రికెట్లో రికార్డుల తిరగరాసిన తీరు చూస్తే ఇలాంటి ఆట, ఆటగాడు నభూతో నభవిష్యత్ అనిపించింది. అలవోకగా సిక్సర్లు కొట్టడం.. ఏ బౌలర్‌నూ లెక్కచేయకుండా నిర్భయంగా ఆడటం.. అద్భుతమైన భుజ బలం, టెక్నిక్ వైభవ్ ప్రధాన అస్ర్తాలు, ఆయుధాలు.! 15 ఏండ్ల కుర్రాడిలో ఇలాంటి లక్షణాలు అరుదు.!! అయితే, తన ఆటలో ఇన్ని మెరుపులతో పాటు కొన్ని లోపాలూ కనిపిస్తున్నాయి. వాటిని సరిదిద్దుకుంటే వైభవ్‌కే కాదు తాను ఆడినంత కాలం భారత జట్టుకూ తిరుగుండదు.
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం: ఒక క్రికెటర్ రికార్డుల జాబితా ఎంత పెద్దగా ఉన్నా, ఆటలో నిలకడ అనేది అత్యంత కీలకం. ప్రస్తుతం సూర్యవంశీ ఆటలో ్ర నిలకడే కనిపించడం లేదు. యూఏఈపై డబుల్ సెంచరీ గత 10 ప్రొఫెషనల్ ఇన్నింగ్స్‌ల్లో వైభవ్‌కు తొలి 50 ప్లస్ స్కోరు కావడం ఆలోచించాల్సిన విషయం. సెప్టెంబర్ 1న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సెంట్రల్ జోన్‌పై ఈస్ట్ జోన్ తరఫున హాఫ్ సెంచరీ చేసిన తర్వాత మళ్లీ పెద్ద స్కోరు చేయడానికి అతడికి 10 ఇన్నింగ్స్‌లు పట్టింది. మధ్యలో ఆడిన నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో శ్రీలంకపై 38, పాకిస్థాన్‌పై 15, న్యూజిలాండ్‌పై 4, 45 పరుగులు చేయగలిగాడు.
పెద్ద జట్లపై తడబాటు.. షార్ట్ బాల్ బలహీనత
ఈ టోర్నీలో ఇప్పటికే నేపాల్, పాకిస్థాన్ చేతిలో ఓడిన బలహీన యూఏఈ బౌలింగ్‌పై వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కానీ నిజమైన పరీక్ష ఎదురైన పాకిస్థాన్-ఎ మ్యాచ్‌లో మాత్రం అనుభవజ్ఞులైన పేసర్లు అలీ రజా, మహ్మద్ ఇమ్రాన్ ముందు నిలబడలేకపోయాడు. ఔట్ స్వింగ్ బంతిని బాదబోయి టాప్ ఎడ్జ్‌తో 13 బంతుల్లో 11 పరుగులకే పెవిలియన్ చేరాడు.
తొలి బంతి నుంచే బ్యాట్‌కు పని చెప్పడం వైభవ్ సహజశైలి. ఉడుకు రక్తంలో ఆ మాత్రం దూకుడు సహజం. కానీ, ఫార్మాట్‌కు, పరిస్థితులకు, జట్టు అవసరాలకు తగినట్టు ఆడటమే ఒక పరిపూర్ణ క్రికెటర్ కర్తవ్యమని బీహార్ బుడ్డోడు గుర్తుంచుకోవాలి. ఇక, జూన్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన సూర్యవంశీ జింబాబ్వేపై రెండు హాఫ్ సెంచరీలు చేసినా, ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ వేగానికి, దూసుకొచ్చే షార్ట్ పిచ్ బంతులకు వైభవ్ తడబడ్డాడు.
ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడితే..
వైభవ్ అసాధారణ ప్రతిభావంతుడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అతడు పూర్తిస్థాయి ఆటగాడిగా ఎదగడానికి సమయం పడుతుంది. ఒక బ్యాటర్‌గా సానబెట్టుకోవడానికి, బంతిని అంచనా వేయడంలో పరిణతి సాధించడానికి ఫస్ట్ క్లాస్ (రెడ్ బాల్) క్రికెట్ ఎంతో అవసరం. కానీ జాతీయ జట్టు అవసరాల వల్ల ఈ రంజీ ట్రోఫీలో బీహార్ ఆడిన నాలుగు మ్యాచ్‌లకు వైభవ్ దూరమయ్యాడు. ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలోనూ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి దోహా వెళ్లాడు.
గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన అనధికారిక టెస్టులకు భారత్-ఏ జట్టులో వైభవ్‌కు చోటు కల్పించకపోవడంపై మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆందోళన వ్యక్తం చేశాడు. రెడ్ బాల్ క్రికెట్లోనే వైభవ్ అసలైన పరీక్ష ఎదుర్కోవాల్సి ఉందని అతను అభిప్రాయపడ్డాడు. ఒకవైపు దేశవాళీ షెడ్యూల్‌తో టోర్నీలు క్లాష్ అవుతుండటం, మరోవైపు ‘ఎ’ జట్టులో అంతర్జాతీయ ఆటగాళ్లను చేర్చడంపై బీసీసీఐ విధానాలు చర్చనీయాంశంగా మారాయి.
ఏదేమైనా మెరుపు డబుల్ సెంచరీతో అంతా సాఫీగా సాగిపోతోందనే భ్రమలో పడిపోతే సమస్యలు మరుగున పడిపోతాయి. వైభవ్‌లోని నిలకడ లేమి, షార్ట్ పిచ్ బంతులపై తడబాటును సరిదిద్ది, రెడ్ బాల్ క్రికెట్లోనూ రాటుదేలేలా స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించాల్సిన బాధ్యత ఇప్పుడు బీసీసీఐ, కోచింగ్ సిబ్బందిపై ఉంది. సూర్యవంశీ నిర్భయమైన ఆటకు నిలకడ అనే మరో అస్త్రం తోడైతే ఇక అతడిని ఆపడం ఎవ్వరి తరం కాదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

