నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 10: కొలువుల భర్తీ ప్రకటనపై యువత సంబురాల్లో మునిగిపోయింది. అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి మెడిచెల్మెల నాని వినూత్న రీతిలో సంబురాలు జరిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, ఆయన తనయుడు డాక్టర్ సంజయ్ చిత్రాలతో ఏర్పాటు చేసిన భారీ కటౌట్‌కు క్రేన్ సాయంతో క్షీరాభిషేకం చేసి తన అభిమానాన్ని చాటుకొన్నా రు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన సంబురాల్లో యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను సైతం రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించడంతో ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. టీఆర్ఎస్తోపాటు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరుద్యోగులు, యువతీయువకులు, కాంట్రాక్టు ఉద్యోగులు కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామంటూ కాంట్రా క్టు ఉద్యోగులు పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రకటనతోపాటు వయోపరిమితి పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకొన్న ముఖ్యమంత్రి
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. 11,103 మంది కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరిస్తూ, 80,039 ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ సీఎం ప్రకటన చేయడం హర్షణీయం. ఉద్యమకాలంలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్తు, నీటి సమస్యలను శాశ్వతంగా పరిషరించారు. కేంద్రం నుంచి చేయూత లేనప్పటికీ రాష్ట్రాన్ని గొప్ప ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో గొప్పగా స్థిరపడాలని మనసారా కోరుతున్నా. – కొప్పుల ఈశ్వర్, సంక్షేమశాఖల మంత్రి
దార్శనికుడు.. సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికుడు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చరిత్రలో నిలిచిపోయేలా అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఉద్యోగులకు ఎట్టకేలకు సముచితమైన గౌరవం కల్పించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్న.
– జగన్నాథం ప్రవీణ్, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థాపక అధ్యక్షుడు
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అభినందనీయం
రాష్ట్రంలోని 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం అభినందనీయం. దీన పరిస్థితుల్లో జీవనం సాగిస్తూ, అభద్రతాభావంతో పనిచేస్తున్నవారి జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్‌కు నిండుహృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రైతులు, వృద్ధులు, ఆడబిడ్డల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్.. మానవీయ కోణంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్టు అసెంబ్లీలో ప్రకటించి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారు.
– డాక్టర్ పరశురామ్, డాక్టర్ బైరి నిరంజన్, యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (కాంట్రాక్ట్)
మార్చి 9 లక్ష కుటుంబాలకు పండుగ రోజు
భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌పై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన మార్చి 9.. తెలంగాణలో లక్ష కుటుంబాలకు పండుగ రోజులా మారింది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో నిరుద్యోగుల తలరాత మారనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకొంటున్న.
– ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
మాట తప్పని నాయకుడు కేసీఆర్
లక్షకుపైగా ఉద్యోగాలు భర్తీచేసి, మరో 80,039 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్ మరోసారి నిరుద్యోగుల పట్ల ఆయనకు ఉన్న బాధ్యతను తెలియజేశారు. దేశ చరిత్రలో మాట తప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ముమ్మాటికీ కేసీఆరే. రాష్ట్ర ఏర్పాటు నుంచి నేటి వరకు అన్ని వర్గాల ప్రజలకు సరైన సందర్భంలో న్యాయం చేస్తూ దేశానికే ఆదర్శమైన నాయకుడిగా నిలిచారు. ఇది కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనం. ఎన్నారైల పక్షాన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్న.
– అనిల్ కూర్మాచలం, ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
చరిత్రలో నిలిచే ఉద్యోగాల ప్రకటన: పీఆర్టీయూ టీఎస్
రాష్ట్రంలో పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన దేశ చరిత్రలో నిలిచిపోతుందని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు ప్రశంసించారు. దేశం అబ్బురపడే స్థాయిలో ఉద్యోగాల ప్రకటనతో సీఎం యువత బంధు అయ్యారని పేర్కొన్నారు. సెకండరీ, ఉన్నత విద్యాశాఖలో 20 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీతో, రాష్ట్ర విద్యావ్యవస్థ మరింత బలోపేతమవుతుందని వెల్లడించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ హర్షణీయం
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రకటనపై ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. గురువారం రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. పల్లాను కలిసినవారిలో గాదె వెంకన్న, గోవర్ధన్, నాగునాయక్, గుండు ఆంజనేయులు తదితరులు ఉన్నారు.