వ్యవసాయ యూనివర్సిటీ, ఆగస్టు 21: వ్యవసాయ రంగంలో తెలంగాణ అనతి కాలంలోనే విప్లవాత్మక పురోగతి సాధించిందని అమెరికా వ్యవసాయ నిపుణుడు డాక్టర్ ధ్రువ్ సూద్ కొనియాడారు. గత పదేండ్ల నుంచి తెలంగాణ దేశంలోనే అత్యధిక వ్యవసాయ దిగుబడులు సాధించడంతోపాటు విదేశాలకూ ఎగుమతులు చేయడం రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు నిదర్శనమని ప్రశంసించారు. సారవంతమైన నేలలు అధికంగా ఉన్న తెలంగాణలో లాభసాటి వ్యవసాయం సాధ్యమేనని, ముఖ్యంగా పత్తి, మిర్చి లాంటి వాణిజ్య పంటల సాగుకు రాష్ట్రంలోని భూములు ఎంతో అనుకూలమని తెలిపారు. తెలంగాణ మాదిరిగా భారత్‌లోని అన్ని రాష్ర్టాలు వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని చెప్పారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన డాక్టర్ ధ్రువ్ సూద్.. భారత్‌లో అమెరికా వ్యవసాయ విభాగం నిర్వహిస్తున్న కార్యకలాపాల గురించి వివరించారు. వ్యవసాయానికి భారత్‌లోనూ డ్రోన్లు, రోబోల లాంటి అధునాతన పరికరాలను ఉపయోగించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం వెంకటరమణ, పరిశోధనా సంచాలకుడు డాక్టర్ రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.