కేసీఆర్ దూరదృష్టి ఈ నేలపై చీకట్లను పారదోలింది. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కృషి తెలంగాణ కరెంటు కష్టాలను దూరం చేసింది. ఆయన దార్శనికత విద్యుత్తు సర్ప్లస్ స్టేట్‌గా మార్చింది. ఆ వరుసలోనిదే యాదాద్రి పవర్ ప్లాంట్. బీఆర్ఎస్ హయాంలోనే 90శాతం పనులు పూర్తిచేసుకున్న వైటీపీఎస్ ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది. గత సర్కారు కరెంటు నిర్ణయాలపై అనుమానంతో, అక్కసుతో విచారణకు ఆదేశించిన రేవంత్ సర్కార్ నేడు ఆ ప్లాంట్‌ను ప్రారంభించించనున్నది.
YTPS | హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో, రాష్ట్ర భవిష్యత్ విద్యుత్తు డిమాండ్లను తీర్చేందుకు రూపకల్పన చేసిన యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ కలసాకారమవుతున్నది. ఈ ప్లాంట్ విద్యుత్తు వెలుగులీనేందుకు సిద్ధమైంది. ప్లాంట్‌లోని యూనిట్ 2ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎదుర్కొన్న కరెంటు కష్టాలను రూపుమాపేందుకు స్వరాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ వైటీపీఎస్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు 2015 జూన్ 8న కేసీఆర్ భూమిపూజ చేశారు. రూ.30 వేల కోట్లతో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు యూనిట్లు మొత్తంగా నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విద్యుత్తు ఉత్పత్తికి కావాల్సిన నీటిని కృష్ణా నది నుంచి తీసుకునేందుకు పైపులైన్‌తోపాటు బొగ్గు రవాణా కోసం సమీపంలో జాన్‌పహాడ్ రైల్వే క్రాసింగ్ నుంచి ప్లాంట్ వరకు ఎనిమిది కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణం చేపట్టారు. ప్లాంట్‌కు సంబంధించిన పనులన్నీ బీఆర్ఎస్ హయాంలోనే 90% మేరకు పూర్తయ్యాయి.
విద్యుత్తు ప్లాంట్ నిర్మాణ పనులను అడ్డుకునేందుకు అటు కేంద్రం, ఇటు పొరుగు రాష్ట్రంతోపాటు అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు అనేక విధాలుగా ప్రయత్నించారు. ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణను అడ్డుకునేందుకు స్థానిక నేతలు అనేక రకాలుగా యత్నించారు. నిర్వాసితులను రెచ్చగొట్టాలని చూశారు. భూనిర్వాసితులకు నాడు కేసీఆర్ ప్రభుత్వం నచ్చజెప్పి, డిమాండ్ మేరకు నష్టపరిహారం అందించి అన్నివిధాలుగా వసతులు కల్పించి ఆదుకోవడంతో వారి ఆటలు సాగలేదు. అటు తరువాత కరోనా సమయంలో పది వేల మంది కార్మికులు తమతమ రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో ప్లాంట్ పనులు రెండేండ్లు నిలిచిపోయాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, పనులను తిరిగి పట్టాలెకించింది. పనులు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో మళ్లీ కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ప్లాంట్‌లో విద్యుత్తు ఉత్పత్తికి అడ్డంకి ఏర్పడింది. పర్యావరణ నిబంధనల మేరకే అనుమతులన్నీ తీసుకున్నప్పటికీ, దాదాపు తుది దశకు చేరుకునే క్రమంలో ప్లాంట్‌పై మళ్లీ అధ్యయనం చేయాలని గ్రీన్‌ట్రిబ్యునల్ మెలికలు పెట్టింది. ఆయా న్యాయవేదికలపై బీఆర్ఎస్ సర్కారు బలమైన వాదనలు వినిపించింది. అడ్డంకులు తొలగించేందుకు విశేష కృషి చేసింది. కేసీఆర్ హయాంలోనే పనులన్నీ పూర్తి చేసుకున్న ప్లాంట్ ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది.
దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో మొత్తంగా ఐదు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ సామర్థ్యం 800 మెగావాట్లు. ఇందులో ఇప్పటికే 1, 2వ యూనిట్లను ఒకేసారి లైటప్ చేశారు. సింక్రనైజేషన్ కూడా ప్రారంభం కాగా, రోజుకు కొంత విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైంది. ఇటీవలనే సింక్రనైజేషన్‌లో భాగంగా పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ఆయా యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తి విజయవంతంగా పూర్తయింది. శనివారం నుంచి కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్లాంట్‌లోని యూనిట్ 2ను శనివారం ప్రారంభించనున్నారు. 72 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తు ఉత్పత్తి కొనసాగిన అనంతరం యూనిట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. త్వరలోనే ఈ ప్లాంట్ నుంచి 1600 మెగావాట్ల విద్యుత్తు గ్రిడ్‌తో అనుసంధానం కానున్నది.
వివిధ రాష్ర్టాలు, సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు కొనుగో లు ఒప్పందాలు ముగియనున్న తరుణం లో ఆ లోటును భర్తీ చేసేందుకు యాదా ద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ ఆశాదీపం కానున్నది. రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చేందుకు ఇతర రాష్ట్రాల్లోని పవర్ప్లాంట్లతో చేసుకున్న ఒప్పందాల గడువు సమీపిస్తున్నది. కీలక అగ్రిమెంట్లు రానున్న రెండు మూడేండ్లలో ముగియనున్నాయి. 2024-25లో 2,284 మెగావాట్లు, 2025-26లో 2,400 మోగావాట్ల విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు ముగుస్తాయి. వాటితోపాటు మరో 2,899 మెగావాట్ల సోలార్ విద్యుత్తు వినియోగ ఒప్పందాలు సైతం ముగియనున్నాయి. రామగుండం యూనిట్-7కు చెందిన 87.76 మెగావాట్ల ఒప్పందం 2026-27లో ముగియనున్నది. 2028-29లో 583.9 మెగావాట్ల సింహాద్రి ఒకటో దశ ఒప్పందం ముగియనుండగా, అదే ఏడాదిలో వెయ్యి మెగావాట్ల ఛత్తీస్‌గఢ్ ఒ ప్పందం గడువు సైతం 2028-29లో పూర్తికానున్నది. రానున్న పదేండ్లలో మొ త్తంగా 4,684 మోగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల గడువు ముగియనున్నది. సరిగ్గా విద్యుత్తులోటు ఏర్పడే ఆ సమయంలోనే యాదాద్రి పవర్‌ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుండటం విశేషం. దీంతో ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసే పరిస్థితి తప్పనున్నది. 2025 -26 కల్లా యాదా ద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని అన్ని యూనిట్లు అందుబాటులోకి వస్తాయి.