హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): లైంగికదాడి కేసులు, పోక్సో నేరాలను నిరూపించేందుకు పక్కా ఆధారాలు ఉండాలని, వాటితోనే కోర్టులో శిక్ష ఖరారు అవుతుందని, ఆ మేరకు అన్ని జిల్లాల మెడికల్ ఆఫీసర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖాగోయల్ అన్నారు. భరోసా సెంటర్స్ ఆధ్వర్యంలో 85 మంది మెడికల్ ఆఫీసర్లకు ఫోరెన్సిక్ ఎవిడెన్స్‌పై నిర్వహించిన వర్క్‌షాపు సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిందితులకు శిక్ష పడితేనే వ్యవస్థపై భరోసా ఏర్పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో పేట్లబుర్జు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి పొన్నూరు, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ పీ అశోక్, ఫోరెన్సిక్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ సుధా, డాక్టర్ మమత రఘువీర్, భరోసా సెంటర్స్ స్పెషల్ పీపీ ప్రతాపరెడ్డి, దుర్గాజీ వివిధ అంశాలపై తమ అనుభవాలను పంచుకున్నారు.
ఆరేండ్ల పాపను లైంగికదాడి నుంచి కాపాడిన కల్యాణ్‌ను తన కార్యాలయంలో శిఖాగోయల్ సత్కరించారు. పంజాగుట్టకు చెంది న అఫ్రోజ్‌ఖాన్ ఆరేండ్ల పాపకు చాక్లెట్లు కొనిస్తానని ఎర్రమంజిల్ మెట్రోస్టేషన్ వరకు తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నిస్తుండగా, బైక్ రైడర్ కల్యాణ్ కాపాడినట్టు ఆమె తెలిపారు. కల్యాణ్ పోలీసులకు ఫోన్ చేయడంతో నిందితుడ్ని పట్టుకున్నట్టు చెప్పారు.