వంగూరు, ఆగస్టు 23: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వగ్రామమైన నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై దాడి సరికాదని గ్రామస్థులు అంటున్నారు. ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ ఎందరికి వర్తించిందో తెలుసుకునేందుకు వచ్చిన జర్నలిస్టులపై అత్యంత దారుణంగా అల్లరిమూకలు దాడి చేసిన విషయం విదితమే.
శుక్రవారం ఈ విషయమై గ్రామంలో పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టు తెలిసింది. దాడి మంచిదికాదని పలువురు రైతులు చర్చించుకున్నారు. ‘అవును రుణమాఫీ చాలామంది రైతులకు కాలేదనేది వాస్తవం.. అది తెలుసుకోవడానికి వచ్చిన వారిపై దాడి చేయడం మంచిది కాదు.
గ్రామం పేరు చెడగొట్టారు.. అవసరమైతే మరుసటి రోజు కాంగ్రెస్ నాయకులు విలేకరులను పిలిచి వాదన చెప్పాల్సింది.. కానీ వారిపై దాడి చేయడం ఏ మాత్రం సరికాదు.. ప్రశాంతంగా ఉన్న ఊరికి రాష్ట్రస్థాయిలో చెడ్డ పేరు తెచ్చారు’ అని మాట్లాడుకున్నట్టు తెలిసింది.