హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని బార్, రెస్టారెంట్లకూ ప్రతి రెండేండ్లకు ఒకసారి టెండర్ పద్ధతిలోనే లైసెన్సులు మంజూరు చేయాలని, దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరుతుందని తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సూచించారు. వైన్ షాపులకు రెండేండ్లకోసారి టెండర్ పద్ధతిలో లైసెన్సులు తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి 87 శాతం ఆదాయం వస్తుంటే, బార్, రెస్టారెంట్ల ద్వారా కేవలం 15శాతం లోపు ఆదాయమే వస్తుందని తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అసోసియేషన్ అధ్యక్షుడు డీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడా రు. మద్యం షాపుల యజమానులపై, పర్మిట్ రూమ్‌లు, సమయం కుదింపుపై బార్, రెస్టారెంట్స్ అసోసియేషన్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. జి ల్లాల్లో 10 గంటలకు మద్యం షాపులు మూసివేసినట్టే నగరాల్లో కూడా 10 గంటలకే మ ద్యం దుకాణాలను మూసివేయాలనడం అవివేకమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో బార్లు అర్ధరాత్రి 12 గంటల వరకు నడుస్తున్నా తామే మీ అభ్యంతరం చెప్పడం లేదని తెలిపారు. ఎందుకు తమ దుకాణాల వేళలను తగ్గించాలని రోడ్డెక్కుతున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే పర్మిట్ రూమ్‌లను నిర్వహిస్తున్నామని, అక్కడ ‘రెడీ టు ఈట్’ పదార్థాలు మినహా వారు చెప్తున్నట్టు భారీ సిట్టింగ్‌లు ఏమీ లేవని తెలిపారు. ఎమ్మార్పీకే మద్యం విక్రయిస్తుండటంతో ఎంతోమంది కస్టమర్లు పర్మిట్ రూమ్‌లనే ఇష్టపడుతున్నారని, 2010 నుంచి ఉన్న ఈ నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్ చేయడం తీవ్ర అభ్యంతరకరమని తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ ఎక్సైజ్ ట్యాక్స్ కింద పర్మిట్ రూమ్‌కు రూ.5 లక్షలు చెల్లిస్తున్నామని చెప్పారు.
బార్లలో అక్రమంగా మద్యం అమ్మకాలు
రాష్ట్రంలోని కొన్ని బార్, రెస్టారెంట్లలో వినియోగదారులకు అక్రమంగా రిటైల్ మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారని డీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. బార్, రెస్టారెంట్ల సమాయాన్ని 11 గంటలకు పైగా పెంచడం వల్ల ఆ ప్రభావం తమపై పడుతుందని, దాని వల్ల 20 శాతం నష్టాలను చవిచూస్తున్నామని చెప్పారు. వినియోగదారులకు మద్యం పార్శిళ్లను నేరుగా అమ్మే వారిపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్సైజ్‌శాఖ కమిషనర్ కలిసి వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, కోశాధికారి సుభాశ్, ఉపాధ్యక్షుడు ప్రభు పాల్గొన్నారు.