హైదరాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): ఇండియన్ సెమీకండక్టర్ మిషన్(ఐఎస్ఎం) కింద తెలంగాణలో సెమీకండక్టర్ అడ్వాన్స్ ప్యాకేజింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్(ఏపీఎంపీ)ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలు కొలువుదీరడంతోపాటు తగిన మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన పర్యావరణ వ్యవస్థ తెలంగాణలో ఉన్నాయని ఆయన చెప్పారు. ఢిల్లీలో బుధవారం జరిగిన వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండైర్డెజేషన్ అసెంబ్లీ(డబ్ల్యూటీఎస్ఏ) 2024 సదస్సులో భాగంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సెమీకండక్టర్ల పరిశ్రమతోపాటు ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి తెలంగాణలో అపార అవకాశాలున్నాయని చెప్పారు. వంద కోట్ల స్మార్ట్ఫోన్ వినియోగదారులు, కోటి ఎలక్ట్రిక్ వాహనాలు, రెండు వందల కోట్ల ఇంటర్నెట్ ఆధారిత వస్తువుల వినియోగం దిశగా భారత్ ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో సెమీకండర్లకు భారీ గిరాకీ ఏర్పడుతున్నదని, ఈ మార్పుకు నాయకత్వం వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు.