హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం భిన్న వాతావరణం నెలకొన్నది. మధ్యాహ్నం వరకు భానుడు నిప్పులు కురిపించగా, సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం రాష్ట్రంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, సాయంత్రం మాత్రం అక్కడక్కడ వర్షం కురిసినట్టు తెలిపింది.
అత్యధికంగా కుమ్రంభీం జిల్లా దహేగాంలో 44.4 డిగ్రీలు, మంచిర్యాలలో 44.2, నల్లగొండలో 44.2, కామారెడ్డిలో 44.1, పెద్దపల్లిలో 44.1, ఆదిలాబాద్లో 44, హైదరాబాద్లో41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది. మరోవైపు మే డ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వడగండ్ల వర్షం కురువగా, అత్యధికంగా ము లుగు జిల్లాలో 8.89 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. ఈనెల 24 నుంచి 29 వరకు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.