హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 ( నమస్తే తెలంగాణ) : దగా పడ్డ తెలంగాణను ఉమ్మడి పాలకుల కబంధహస్తాల నుంచి విడిపించి.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది బీఆర్ఎస్సేనని టీఎంయూ వైస్ చైర్మన్, ఆర్టీసీ జేఏసీ నాయకుడు థామస్‌రెడ్డి తెలిపారు. వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకుని ‘నమస్తే తెలంగాణ’తో ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా థామస్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాకారం కలగా ఉన్ననాడు రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించారని తెలిపారు. స్వరాష్ట్రం కోసం బీఆర్ఎస్ ఎన్నో వీరోచిత పోరాటాలు చేసిందని, దానికి ప్రజలే సాక్ష్యమని స్పష్టంచేశారు. కేసీఆర్ పార్టీ పెట్టకపోతే తెలంగాణ వచ్చేదే కాదని కుండబద్దలు కొట్టారు. పార్టీ ఆవిర్భావం సమయంలో ఎన్నో అవమానాలు, బెదిరింపులు, కేసులను ఎదుర్కొని, వెనకడుగు వేయకుండా తెలంగాణ కోసం కేసీఆర్ నిలబడ్డారని కొనియాడారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ సకల జనులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపించారని వివరించారు. తెలంగాణ కల సాకారమయ్యాక రెండు పర్యాయాలు సీఎంగా ఉన్న కేసీఆర్.. నీళ్లు, నిధులు, నియామకాలు సహా అన్నింటా రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపారని తెలిపారు. ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో కష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆధునీకరించి, ఆదుకున్నారని వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు బాటలు వేసింది కూడా కేసీఆరేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కారు ఆర్టీసీ కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని ఆరోపించారు. బూటకపు మాటలతో కాంగ్రెస్ పబ్బం గడుపుతున్నదని విమర్శించారు. మళ్లీ కేసీఆర్ పాలన వస్తేనే ఆర్టీసీ బాగుపడుతుందని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించే ఆర్టీసీ కార్మికులందరూ వరంగల్‌లో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు, సిద్ధాంతాలను పక్కనపెట్టాలని, 60 ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేసి న బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవానికి వెళ్లడం గౌరవంగా భావించాలని థామస్‌రెడ్డి తెలిపారు.