హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా జారీ అవుతున్న నోటీసులపై విచారణ(హియరింగ్)కు తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయ వర్గాలు స్పష్టంచేశాయి. నోటీసుల్లో పేర్కొన్న ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చని తెలిపాయి. ఈసీఐనెట్‌లోని ఓటరు ఫోల్డర్ ద్వారా ఆన్లైన్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవచ్చు. బీఎల్వోలకు నేరుగా కూడా సమర్పించవచ్చు. విచారణ సమయంలోనూ అధికారులకు అందజేయవచ్చు. కానీ, నోటీసులో పేర్కొన్నట్టు విచారణకు అనివార్యంగా హాజరుకావాల్సిందే. చిన్నపాటి స్పెల్లింగ్ మిస్టేక్స్, పేర్లలో తప్పులను సవరిస్తున్న అధికారులు.. మ్యాపింగ్ కాని ఓటర్ల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారు. నకిలీ లేదా మార్ఫింగ్ చేసిన ఫొటోలను వినియోగించినట్టు గుర్తించిన ఓటర్ల పేర్లను తుది ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారు. నోటీసులు, విచారణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదు అధికారులు (ఈఆర్వోలు) పలు అనుమానాస్పద కేసులను గుర్తించి, ఎన్యుమరేషన్ ఫామ్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అనర్హులుగా గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,100 మంది ఓటర్లను అనర్హులుగా గుర్తించినట్టు సీఈవో కార్యాలయ వర్గాలు వె ల్లడించాయి. అనర్హతకు మార్ఫింగ్ ఫొటోలు, ఒకే వ్యక్తికి ఒకటికంటే ఎకువ ఓట్లు ఉండటం, మరణించిన వారి పేర్లు జాబితాలో ఉండటం వంటి కారణాలని తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా.. ‘సర్’లో భాగంగా ఇప్పటివరకు 2,64,87,213 మంది ఎన్యుమరేషన్ ఫామ్‌లను సమర్పించారు. 92,87,577 మంది ఓటర్ల ఫామ్‌లలో ఏదో ఒక రకమైన లోపం లేదా అస్పష్టత ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 60,50,918 మంది ఓటర్ల పేర్లు, వయస్సు తదితర వివరాలు సరిపోలకపోవడం, పేర్ల స్పెల్లింగ్‌లో తప్పులు ఉన్నాయి. 32,36,659 మంది ఓటర్లు ‘సర్’ -2002 జాబితాతో తమ వివరాలను మ్యాప్ చేసుకోలేకపోయారు. ఈ సమస్యలను పత్రాల పరిశీలన, క్షేత్రస్థాయి ధ్రువీకరణ ద్వారా పరిషరించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఎన్నికల జాబితాలోని అనుమానాస్పద లేదా వివరణ అవసరమైన వివరాలపై ఇప్పటికే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 61 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. సుమారు 31 లక్షల నోటీసులు సంబంధిత ఓటర్లకు ఇంకా అందాల్సి ఉన్నదని అధికారులు తెలిపారు. నోటీసులు అందుకున్నవారిలో ఇప్పటివరకు సుమారు 18 లక్షల మందిని తుది ఓటర్ల జాబితాలో చేర్చేందుకు అర్హులుగా గుర్తించినట్టు పేర్కొన్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై ఓటర్లు, ఇతర వ్యక్తులు అక్టోబర్ ఏడు వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై నోటీసులు జారీ చేసి విచారణ జరిపి పరిషరించే ప్రక్రియ నవంబర్ ఐదో తేదీ వరకు కొనసాగనున్నది.