సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నగరంలో ప్రయాణికుల రాకపోకలు రాత్రి సమయాల్లోనూ అధికంగా ఉంటున్న దృష్ట్యా అందుకు తగ్గట్టు థర్ట్షిఫ్ట్ పేరుతో రాత్రి బస్సు సర్వీసులను ఆర్టీసీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈనెల 1 నుంచి నగరంలోని 6 రూట్లలో తెల్లవారుజాము 3 గంటల వరకు బస్సులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మరి కొన్ని రూట్లలోనూ ఇలాంటి బస్సు సేవలు ప్రవేశపెట్టాలని ఆర్టీసీ యోచిస్తున్నది. మరోవైపు థర్ఢ్షిఫ్ట్ విధులు నిర్వర్తించడానికి డ్రైవర్లు జంకుతున్నారు.
చాలా మంది డ్రైవర్లు ఇప్పటికే బీపీ, షుగర్లతో బాధపడుతున్నట్టు ఆర్టీసీ యూనియన్ నాయకులు తెలిపారు. ఉచిత బస్సుకు ముందర గ్రేటర్లో ఆర్టీసీ మహిళా ప్రయాణికులు 5 లక్షల మంది ఉండేవాళ్లు. ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు రోజుకు సుమారు 24 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఇందులో 17 లక్షల మంది మహిళలే ఉండటం విశేషం. ఒక్క రోజుకు ఇంత మంది ప్రయాణం కేవలం గ్రేటర్లో ఉన్న 2900 బస్సులపైనే ఆధారపడి ఉంది.
రోజుకు 30వేల ట్రిప్పులు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. దీంతో ప్రతీ బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. ఇలాంటి క్రమంలో థర్డ్షిఫ్ట్ పేరుతో రాత్రంతా బస్సులు నడపాలంటే ఆరోగ్యం సహకరించే పరిస్థితి ఉండదని అన్నారు. డబుల్ డ్యూటీల పేరుతో డ్రైవర్లు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. గ్రేటర్లో పని ఒత్తిడి కారణంగా డ్రైవర్లు అధిక రక్తపోటు, వినికిడి, దృష్టి, బ్రెయిన్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. విశ్రాంతి లేకుండా ఏకధాటిగా 12-15 గంటల వరకు బస్సలు నడపాల్సి వస్తుండటంతో మానసిక రుగ్మతలు ఎదుర్కొంటున్నారు.
డ్రైవర్లకు ప్రతీ ఏడాది రెండు స్లారు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అండగా నిలవాల్సి ఉన్నా.. పెద్దగా యాజమాన్యం దృష్టి సారిండం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ల ఆరోగ్యంపై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, కోఠి నుంచి పటాన్ చెరు(222ఏ), అఫ్జల్గంజ్ నుంచి పటాన్ చెరు(218), సికింద్రాబాద్ నుంచి పటాన్ చెరు (219), హయత్నగర్ నుంచి సికింద్రాబాద్ (290యూ), బాచుపల్లి నుంచి వేవ్ రాక్(195డబ్ల్యూ), కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ (10హెచ్ ) రూట్లల్లో థర్డ్షిఫ్ట్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.
222A కోఠి పటాన్చెరు 3:00
218 అఫ్జల్గంజ్ పటాన్చెరు 3:00
219 సికింద్రాబాద్ పటాన్చెరు 3:00
290U హయత్నగర్ సికింద్రాబాద్ 3:00
195W బాచుపల్లి వేవ్ రాక్ 3:00
10H కొండాపూర్ సికింద్రాబాద్ 3:00