తిరుపతి : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు తెలంగాణ ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున వైకుంఠ ద్వారం గుండా మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్, చామకూర మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో పాటు పలువురు ప్రముఖులు వేర్వేరుగా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనాల అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి, పట్టువస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, దేశవ్యాప్తంగా ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుందన్నారు.
తెలంగాణ కేవలం ఎనిమిదేళ్లలో అభివృద్ధి చేసిన కేసీఆర్.. అన్ని రాష్ట్రాలకు మోడల్‌గా తీర్చిదిద్దారన్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారన్నారు. 2024 ఎన్నికల్లో దేశంలో విజయం సాధించి కేసీఆర్ ప్రధానిగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని స్వామి వారిని వేడుకున్నానన్నారు. రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని, ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టును ఎలాగైతే పూర్తి చేశారో.. అదే తరహాలో పోలవరాన్ని పూర్తి చేసి, ఆంధ్రా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, అభివృద్ధి చేస్తారన్నారు.
కేసీఆర్‌పై వివిధ రాష్ట్రాల ప్రజలకు సమ్మకం వచ్చిందని, కచ్చితంగా రాబోవు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని మల్లారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజున వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తిరుమల వెంకన్న దర్శనంలో సమానత్వం ఉండదేమో అని అపోహలు వచ్చాయని, కానీ ఎలాంటి అపోహలకు తావులేకుండా సమానంగా చూడడం చాలా సంతోషం వేసిందన్నారు.
తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, కేసీఆర్ ఆధ్వర్యంలో మరింత సంక్షేమ పధకాలు ప్రజలకు అందేలా స్వామి వారి ఆశీర్వాదం ఉండాలన్నారు. దానం నాగేంద్ర మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి వారి ఆశీర్వాదం పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా ఉందని, కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని ఉన్నారన్నారు.