హైదరాబాద్, మే30 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ గ్రోత్ ఇంజిన్ అని తెలంగాణ వికాస సమితి వెల్లడించింది. ప్రాజెక్టు ద్వారానే రాష్ట్రంలో పుష్కలంగా సాగు, తాగునీరు అందుబాటులోకి వచ్చిందని, పంటల దిగుబడి, చేపల ఉత్పత్తి పెరిగి రాష్ట్ర ఆదాయం పెరిగిందని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ర్టానికి లైఫ్‌లైన్ అని అభివర్ణించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను సత్వరమే చేపట్టేలా చూడాలని న్యాయవిచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విజ్ఞాపన పత్రాన్ని బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన బాక్సులో తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు అర్రోజు శ్రీనివాస్ గురువారం దాఖలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు రాష్ట్రమంతా కరువు ఉండేదని, ప్రత్యే రాష్ట్ర ఉద్యమ నినాదాల్లో సాగు, తాగునీరు కూడా ఒకటని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగం, ప్రజానీకం నీటి అవసరాలను తీర్చడమే ధ్యేయంగా ప్రపంచంలోనే అతిపెద్ద, మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాళేశ్వరాన్ని చేపట్టిందని గుర్తుచేశారు. అమెరికాలోని హోవర్ డ్యామ్, ఈజిప్ట్ లోని అశ్వాన్డ్యామ్, చైనాలోని త్రిగోర్జెస్ డ్యామ్‌ల నిర్మాణం తరువాత ఆయా దేశాల ఆర్థికవ్యవస్థల్లో ఎలాంటి పెను మార్పులు సంభవించాయో, అదే తరహాలోనే కాళేశ్వరం నిర్మాణం తరువాత తెలంగాణ సామాజిక జీవనంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం తరువాత గోదావరి జలాల వినియోగం 472టీఎంసీల నుంచి 739టీఎంసీలకు 56శాతం పెరిగిందని, భూగర్భజలాల తోడివేత 58శాతం నుంచి 39శాతానికి తగ్గిపోయిందని, భూగర్భజలమట్టం 4మీటర్లు పెరిగిందని గుర్తుచేశారు. విశ్వనగరం హైదరాబాద్ సిటీ తాగునీటి అవసరాలను తీర్చడంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు కీలకభూమికను పోషిస్తున్నదని వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తరువాత రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం 81.6శాతం పెరిగిందని వెల్లడించారు. 2014లో 1.31కోట్ల ఎకరాలు ఉండగా, అది 2022-23నాటికి 2.38కోట్లకు పెరిగిందని, వరి దిగుబడి 68లక్షల టన్నుల నుంచి 3కోట్ల టన్నులకు చేరుకున్నదని తెలిపారు. 2014 నుంచి మొత్తంగా 1.33లక్షల కోట్ల విలువైన 722.92లక్షల టన్నుల వరిధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని, దాదాపు 11.439.6కోట్ల విలువైన ఇతర పంట ఉత్పత్తులను సేకరించిందని గణాంకాలను తెలంగాణ వికాస సమితి ఉదహరించింది. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, 6వేల కోట్ల విలువైన ఉత్పత్తిని సాధించిందని గుర్తుచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో బహుళ ప్రయోజనాలు దాగి ఉన్నాయని వివరించారు. ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్‌ను వెంటనే పునరుద్ధరించేలా రాష్ట్ర అధికారయంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు అర్రోజు శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. వచ్చే వానాకాలం నాటికి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలని కోరారు.