TTD-Telangana Vijaya | టీటీడీలో శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ పదార్థాలు వాడారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టీటీడీకి తెలంగాణ ప్రభుత్వ రంగ డెయిరీ సంస్థ ‘విజయ డెయిరీ’ లేఖ రాసింది. టీటీడీలో లడ్డూ ప్రసాదాల తయారీకి స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సప్లయ్ చేయడానికి తాము సిద్ధమని పేర్కొంది. ఈ మేరకు టీటీడీ ఈఓ జే శ్యామలరావుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ లేఖ రాశారు.
‘దేశమంతా పాలు, పాల ఉత్పత్తుల రంగంలో తెలంగాణ విజయ డెయిరీ ఎంతో ప్రసిద్ధి చెందింది. కస్టమర్లకు విలువైన, నాణ్యమైన ఉత్పత్తులు సప్లయ్ చేసిన చరిత్ర ఉంది. విజయ డెయిరీ ఉత్పత్తుల్లో నాణ్యత నిర్ధారించడంతోపాటు లక్షల మంది పాల రైతుల జీవనోపాధికి మా సంస్థ తోడ్పాటునిస్తోంది. టీటీడీకి అధిక నాణ్యతతో కూడిన నెయ్యి, ఇతర డెయిరీ ఉత్పత్తుల అవసరాలన్నీ తీర్చేందుకు మా సంస్థ సన్నద్ధంగా ఉన్నది. విజయ డెయిరీ.. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల సరఫరా, వాటి స్వచ్ఛత, నాణ్యత, ధరల విషయంలో పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తుంది. టీడీటీ దేవస్థానానికి, భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలి’ అని శ్యామలరావుకు సబ్యసాచి ఘోష్ రాసిన లేఖలో తెలిపారు.