SLBC Tunnel | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగ నిర్మాణాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని సర్కారు తర్జనభర్జన పడుతున్నది. ప్రమాదకర ప్రాంతాన్ని తప్పి స్తూ బైపాస్ సొరంగాన్ని చేపడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేసినా అది అసాధ్యమ ని నిపుణులు తేల్చారు. సొరంగానికి ఆడిట్ పాయింట్‌ను ఏర్పాటు చేయాలని భావించినా అది అదనపు ఖర్చుతోపాటు మరింత సమ యం పడుతుందని పేర్కొన్నారు. సొరంగాన్ని త్వరగా పూర్తి చేసేందుకు డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్(డీబీఎం) ఒక్కటే సరైన మార్గమని, అయితే అనుమతులు తీసుకోవడమేగాక, పనుల నిర్వహణ కూడా కత్తిమీద సాములాంటిదేనని వివరించారు. ఎట్టకేలకు అవుట్లెట్ వైపు నుంచి టీబీఎంతో యథావిధిగా పనులు కొనసాగించాలని నిర్ణయించినా పను లు జాప్యమయ్యే అవకాశముందని సమాచారం. దీంతో ఇప్పుడేం చేయాలా? అని సర్కారు డైలమాలో పడినట్టు తెలుస్తున్నది.
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దిండి రిజర్వాయర్ వరకు 43.50 కి.మీ సొరంగాన్ని తవ్వా ల్సి ఉంది. ఏకకాలంలో రెండువైపుల నుంచి సొరంగం పనులు చేపట్టారు. ఇన్లెట్ అంటే అచ్చంపేట మండలం దోమలపెంట వద్ద శ్రీశై లం రిజర్వాయర్ గట్టు నుంచి, అవుట్లెట్ అంటే మహబూబ్‌నగర్ జిల్లా మన్యవారిపల్లె నుంచి సొరంగం పనులు చేపట్టారు. ఇప్పటివరకు రెండువైపుల కలిపి 34.372 కి.మీ సొరంగం పనులు పూర్తికాగా, ఇంకా 9.560 కి.మీ మేర తవ్వాల్సి ఉంది. ఇన్లెట్ టన్నెల్లో 13.93కి.మీ వద్ద అత్యంత సున్నితమైన షీర్ (పగులువారి వదులైన రాతిపొరలు) జోన్ వద్ద భారీ నీటి ఊటల నేపథ్యంలో టన్నె ల్ పైకప్పు కూలిపోయి 8మంది కార్మికులు మృతి చెందారు. ప్రస్తుతం మృతదేహాల వెలికితీతకు సహాయక చర్యలు కొనసాగుతున్నా యి. టన్నెల్ పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ప్రభుత్వ పెద్దలు ఇటీవల పలువురు నిపుణులు, ఏజెన్సీ ప్రతినిధులతో చర్చించారు. ప్రస్తుతం ప్రమాదం సంభవించిన చోటున ఉన్న షీర్ జోన్‌ను పక్కకు తప్పిస్తూ టన్నెల్‌ను బైపాస్ చేయాలని ఆలోచ న చేశారు.
కొద్దిదూరం ముందుకు తీసుకెళ్లిన అనంతరం యథావిధిగా ప్రధాన టన్నెల్ మా ర్గానికి అనుసంధానిస్తే బావుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. ఆచరణలో అది అసాధ్యమని ఏజెన్సీకి చెందిన విదేశీ నిపుణులు ప్రభుత్వానికి తేల్చిచెప్పినట్టు సమాచారం. అదీగాక టన్నెల్ అలైన్మెంట్ మార్గంలో మరో 4షీర్ జోన్లు కూడా ఉన్నాయని, అక్క డా ఇలాంటి పరిస్థితే ఎదురుకాదని చెప్పలేమని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగానికి ఇప్పటికీ ఒక్క ఆడిట్ పాయింట్ అనేది లేదు. ఉపరితలంలో దట్టమైన అభయారణ్యం విస్తరించి ఉండడమే కారణం. ఆడిట్ పాయింట్ అంటే టన్నెల్ తవ్వకంలో వచ్చే రాళ్లు, మట్టి తరలింపు, రవాణా అవసరాల కోసం, లోపలికి ఆక్సిజన్, వెలుతురు కోసం సొరంగానికి ఏర్పాటు చేసే అదనపు మార్గం. ప్రస్తుతం అమ్రాబాద్ మండలం తిర్మలాపూర్ వద్ద నుంచి ఆడిట్ ఏర్పాటుకు అవకాశమున్నదని సర్కారు భావిస్తున్నది. దానిని కూడా నిపుణు లు తోసిపుచ్చినట్టు సమాచారం. తిర్మలాపూర్ నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం వరకు 5కి.మీ దూరం ఉంటుందని, ఆ మేరకు ఆడిట్ సొరంగాన్ని తవ్వాల్సి ఉంటుందని, అదనపు ఖర్చు అని, టన్నెల్ నుంచి వెలికితీసిన మట్టి, రాళ్లను ఆడిట్పాయింట్ నుంచి బయటకు తరలించి నా, వాటిని నిల్వచేసేందుకు భారీగా భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని వివరించినట్టు సమాచారం. ఆడిట్పాయింట్ ఏర్పాటును ఆదిలోనే విరమించుకున్నారని తెలిసింది.
ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాన్ని టీబీఎం (టన్నెట్ బోరింగ్ మిషన్) ద్వారా కొనసాగిస్తున్నారు. ఆ టీబీఎం ఏర్పాటు చేసి 20ఏండ్లు కాగా, సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. గంటకు 2.5మీటర్లు బోరింగ్ చేయాల్సిన టీబీఎం సామర్థ్యం రోజుకు గరిష్ఠంగా 5 మీట ర్లు కూడా దాటని పరిస్థితి ఏర్పడింది. భారీగా నీటి ఊట రావడం సవాలుగా నిలిచింది. ప్రమాదంలో ఆ టీబీఎం పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలుస్తున్నది. కొత్త టీబీఎం ఏర్పాటుకు రూ. 300-400కోట్ల మేర నిధులు కావడమేగాక, దానిని విదేశాల నుంచి తెప్పించడానికి ఏడాది పట్టే అవకాశమున్నది. దీంతో ప్రస్తుతం డీబీఎం (డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్) విధానం ఒక్కటే శరణ్యమని నిపుణులు సర్కారుకు సూచించినట్టు తెలిసింది. అభయారణ్యా న్ని దృష్టిలో పెట్టుకుని భూప్రకంపనలు లేకుం డా చూసుకోవాల్సి ఉంటుందని, శబ్ధం 50 డెసిబుల్స్ దాటకూడదనే కేంద్రం షరతులకు లోబడి పనులు చేయాల్సి ఉంటుందని తెలిపా రు. టీబీఎం టెక్నాలజీలో ఆటోమేటిక్‌గా మ్యూక్ను(వ్యర్థాలను) కన్వేయర్ బెల్ట్ నుంచి బయటకు పంపే అవకాశముండగా, డీబీఎం లో మాన్యువల్‌గా తరలించాల్సి ఉంటుంది. ఆడిట్ పాయింట్ ఉంటేనే డీబీఎం విధానంలో సొరంగం తవ్వకం సులువని, లేదంటే అదీ అసాధ్యమేనని చెప్పినట్టు సమాచారం. చివరగా ఇన్లెట్ పనులన్నీ నిలిపివేసి, అవుట్లెట్ నుంచే టన్నెల్ పనులను కొనసాగించవచ్చని, సొరంగం పూర్తికి మరింత సమయం పట్టే అవకాశమున్నదని తెలిపినట్టు తెలిసింది. నిపుణులు, ఇంజినీర్లు వెల్లడించిన అభిప్రాయాల నేపథ్యంలో సర్కారు పూర్తిగా డైలమాలో పడింది. ఎస్ఎల్బీసీని ఏం చేద్దాం? పనుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశాలపై తర్జనభర్జన పడుతున్నది.
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 6 : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం దోమలపెంట ఎల్ఎల్బీసీలో చిక్కుకున్న ఆరుగురి కార్మికుల మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతున్నది. మినీ జేసీబీ సహాయంతో లోకో ట్రైన్, టీబీఎం మిషన్ కటింగ్ చేసిన శకలాలను బయటకు తరలించారు. ఆదివారం టన్నెల్ ప్రత్యేకాధికారి శివశంకర్ రెస్క్యూ బృందాల ప్రతినిధులతో మరోసారి సమీక్ష నిర్వహించారు.