హైదరాబాద్ : మునుగోడు ఆత్మగౌరవ సభను అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక బహిరంగ లేఖ విడుదల చేసింది. లేఖలో బీజేపీకి తెలంగాణపై చిత్తశుద్ధి ఉన్నదా? అని ప్రశ్నించింది. 1,386 మంది అమరులు కావడానికి కారణం బీజేపీ పార్టీ అని ఆరోపించింది. ఎన్డీఏ ఇచ్చిన మూడు రాష్ట్రాలతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఉంటే తెలంగాణ కోసం ఇంత మంది అమరులు బలిదానాలు చేసే వారు కదా ? అని ప్రశ్నించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రలో ఏ ఒక్క అమరవీరుడి కుటుంబ సభ్యులను అయినా.. ఏ ఒక్క తెలంగాణ ఉద్యమకారుడినైనా పరామర్శించారా? అని నిలదీసింది. ఈ రోజు వరకు ఏనాడూ మోదీ అమరవీరులకు జోహార్లు అర్పించారా? అని ప్రశ్నించింది.కేవలం తెలంగాణని బీజేపీ కాకినాడ తీర్మానం మొదలుకొని నేటి వరకు కూడా రాజకీయంగా వాడుకునేందుకు చూస్తోందని విమర్శించింది. ఇవాళ రోజు బీజేపీలో చేరుతున్న వారందరూ తెలంగాణను దోచుకునేందుకు చూస్తున్న దొంగలేనని ఆరోపించింది.
నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజలకు కాకినాడ తీర్మానంతో మోసం చేశామని క్షమాపణ చెప్పాలని చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నెల 25న బీజేపీ తెలంగాణకు చేసిన ద్రోహాన్ని తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన ద్వారా మునుగోడు నియోజకవర్గం ప్రజలకు వివరించి.. బీజేపీకి బుద్ధి చెప్తామని ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమరెడ్డి, యూత్ ఫోర్స్ రాష్రట్ర అధ్యక్షుడు బింగి రాములు, తెలంగాణ దళిత సంఘాల జేఏసీ అధ్యక్షుడు గాలి రవీందర్ పేర్కొన్నారు.