Telangana | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడంలో తెలంగాణ దేశంలోనే మరోసారి మొదటిస్థానంలో నిలిచింది. గతంలోనూ అద్భుత పనితీరును నమోదుచేసిన తెలంగాణ తాజాగా మే నెలలోనూ ఉత్తమ ప్రదర్శనను కనబరిచింది. రాష్ట్రం 2,524 పిటిషన్లను అత్యల్పంగా ఎనిమిది రోజుల్లోనే పరిష్కరించింది. లక్షద్వీప్ 12 రోజుల వ్యవధిలో 171 పిటిషన్లను పరిష్కరించి రెండోస్థానంలో ఉండగా, అండమాన్ నికోబార్ 442 పిటిషన్లను 20 రోజుల సగటుతో పరిష్కరించి మూడోస్థానంలో నిలిచింది. 15 వేలలోపు పిటిషన్లు ఉన్న రాష్ర్టాలను గ్రూప్-డీ క్యాటగిరీలో చేర్చారు. ఈ క్యాటగిరీ రాష్ర్టాలకు కేటాయించిన ర్యాంకింగ్‌లోనూ తెలంగాణ మొదటిస్థానం దక్కించుకున్నది.
గ్రూ ప్-డీ క్యాటగిరీలో తెలంగాణ 72.49 స్కోర్‌తో తొలిస్థానంలో నిలవగా.. ఛత్తీస్‌గఢ్ 55.75 స్కోర్‌తో రెండోస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ అట్టడుగున పదో స్థానంతో సరిపెట్టుకున్నది. జాతీయస్థాయిలో సామాన్యుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్‌స్ రెడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టం (సీపీజీఆర్ఏఎంఎస్) పేరుతో ఆన్లైన్ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. సామాన్యులెవరైనా ఈ వేదికపై ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు. కేంద్రం వాటిని రాష్ర్టాలకు పం పించి, పరిష్కరించాలని కోరుతుంది. ఇందుకోసం రాష్ర్టాలవారీగా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ ఆఫీసర్స్ (జీఆర్వో) ఉంటారు. ఇటీవలే వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల జీఆర్‌వోల సమావేశాన్ని నిర్వహించి ఆ నివేదిను బుధవారం విడుదల చేసింది.
మేలో జాతీయంగా 56,981 ఫిర్యాదులను స్వీకరించగా, పెండింగ్‌లో ఉన్నవి కలుపుకుని 65,983 పిటిషన్లను పరిష్కరించారు.రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతా ల్లో పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఏప్రిల్ నాటికి మొత్తం 2,03,715 కేసులు ఉంటే మే నాటికి వీటి సంఖ్య 1,94,713కు తగ్గింది.