‘కూటి కోసం.. కూలి కోసం.. పట్టణంలో బతుకుదామని.. బయలుదేరిన బాటసారికి.. ఎంత కష్టం.. మరెంత కష్టం?’.. ‘ఆకలి రాజ్యం’ సినిమాలోని ఈ పాట గుర్తుందా? అయితే, తెలంగాణలో ఇది ఇక గతం.. ఎనిమిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో కూలీ పనులు, ఇతరత్రా ఉద్యోగాలు చేద్దామని హైదరాబాద్‌కు వచ్చే వారికి చేతి నిండా పనితోపాటు జేబు నిండా పైసలు కూడా వస్తున్నాయి. ఈ విషయాన్ని జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) స్వయంగా వెల్లడించింది. అంతేకాకుండా, వలస కార్మికులు, ఉద్యోగులు, కూలీలు ఎక్కువ వేతనం పొందుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్టు వివరించింది.
NSSO | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): సమైక్య పాలనలో వలసబాట పట్టిన తెలంగాణకు.. నేడు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు, కార్మికులు, ఉద్యోగులు వరుసకడుతున్నారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలన వచ్చాక.. సాగు విస్తీర్ణం, రియల్ ఎస్టేట్, ఐటీ ఎగుమతులు అనూహ్యంగా విస్తరించాయి. దీంతో కూలీలు, కార్మికులు, ఉద్యోగుల అవసరం పెరిగిపోయింది. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో చేతినిండా పని దొరుకుతుండటం, పనికి తగ్గ వేతనం వస్తుండటంతో యూపీ, ఉత్తరాఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ర్టాల నుంచి ప్రజలు క్యూ కడుతున్నారు. దీంతో వలసదారులు ఎక్కువగా ఉపాధి పొందుతున్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. వలస కార్మికులు, కూలీలు, ఉద్యోగులు ఎక్కువగా వేతనం అందుకొంటున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ర్టానికి వలసవచ్చిన ప్రతీ పది మంది ఉద్యోగులు, కూలీల్లో.. ఎనిమిది మంది ఆదాయంలో విశేషమైన వృద్ధి నమోదైనట్టు ఎన్ఎస్ఎస్వో తెలిపింది. వలసదారుల ఆదాయంలో 81.6 శాతం వృద్ధితో తెలంగాణ తొలిస్థానంలో నిలిచినట్టు ఎన్ఎస్ఎస్వో వెల్లడించింది. జాతీయ సగటు 56.2 శాతంతో పోలిస్తే తెలంగాణ ఈ విషయంలో ఎంతో ముందున్నది. 81.4 శాతం ఆదాయ వృద్ధితో హర్యానా రెండో స్థానంలో నిలిచింది.
నిర్మాణరంగంలో హైదరా‘బాద్షా’
తెలంగాణలోని పలు జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో నిర్మాణరంగ కార్మికులకు పనికి తగిన వేతనాలు లభిస్తున్నట్టు ప్రాజెక్ట్ హీరో ది కన్స్ట్రక్షన్ టెక్నో యాప్ ఇటీవల చేపట్టిన సర్వేలోనూ తేలింది. దేశంలోని ఇతర మెట్రో నగరాలైన ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె, ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లోనే మెరుగైన వేతనాలు అందుతున్నట్టు సర్వే వెల్లడించింది. 1.4 లక్షల జాబ్ ప్లేస్మెంట్ సంస్థల నుంచి సమాచారం సేకరించి ఈ నివేదిక తయారు చేసినట్టు వివరించింది. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా వలసదారులకు చేతి నిండా పని దొరుకుతున్నట్టు పేర్కొన్నది.
వలసలకు కారణమేంటి?
విషయం పురుషులు మహిళలు
పెండ్లి 6.2% 86.8%
సంపాదన 17.5% 7.3%
ఉద్యోగం 20.1% 0.7%
ఉపాధి 22.8% 0.6%
ఆధారం: ఎన్ఎస్ఎస్వో సర్వే