Liquor Consumption | తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దాంతో రాష్ట్రం మద్యం అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రతినిత్యం లక్షల లీటర్లలో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఇక మద్యం అమ్మకాల్లో పొరుగు రాష్ట్రమైన ఏపీ రెండోస్థానంలో నిలిచింది. తెలంగాణలో ఒక్కొక్కరు రూ.1623 మద్యం కోసం వెచ్చించగా.. ఏపీలో ఒక్కొక్కరు మద్యానికి రూ.1,306 ఖర్చు చేసినట్లు ఓ సర్వేలో తెలిసింది. ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ (NIPFP) అంచనా వేసింది. ఇక పంజాబ్లో రూ.1,245, ఛత్తీస్గఢ్లో రూ.1,227 చొప్పున ఒక్కొక్క వ్యక్తి మద్యం కోసం ఖర్చు చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్లో తక్కువగా మద్యానికి డబ్బులు వెచ్చినట్లు గుర్తించారు. ఇక తెలంగాణలో మొత్తం 2,620 వైన్స్ షాపులు ఉన్నాయి. అలాగే, వెయ్యికిపైగా బార్స్, పబ్స్ ఉన్నాయి. దసరా పండుగ సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.వెయ్యికోట్లపైగా విలువైన లిక్కర్ సేల్స్ జరిగాయి. 11లక్షల కేసుల మద్యం, 18లక్షల కేసుల బీర్స్ అమ్మకాలు జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఇక దక్షిణ భారతదేశంలో బీర్ల విక్రయాలు అత్యధికంగా తెలంగాణలో అమ్ముడవుతున్నట్లుగా సర్వేలో తేలింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 302.84 లక్షల బీర్లు అమ్ముడయ్యాయి. ఏపీలో 169 లక్షల బీర్లు అమ్ముడయ్యాయి.