హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగిన బయో ఏషియా 2025 సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేసేదానిపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నదన్నారు.
మరోవైపు, లైఫ్ సైన్సెస్ పాలసీపై త్వరలోనే క్యాబినెట్ నిర్ణయం తీసుకోనున్నదన్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల విద్యార్థులకు తగిన నైపుణ్యం లభించడం లేదని, ఈ అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా పరిశ్రమల భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు.
కాలుష్య రహిత ఫార్మా పరిశ్రమలను ఏర్పాటే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నదని, ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఈ యూనిట్లను తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వికారాబాద్, జహీరాబాద్‌లలో ఇప్పటికే స్థలాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈసారి నిర్వహించిన సదస్సులో ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్, బయోటెక్నాలజీ, డిజిటల్ హెల్త్‌కేర్ రంగాలకు చెందిన 3 వేల మంది డెలిగేట్స్ పాల్గొన్నారు.
బయో ఏషియా సదస్సుకు హాజరైన 84 స్టార్టప్‌ల్లో ఐదు స్టార్టప్‌లకు అవార్డులు వరించాయి. వీటిలో సెమ్జినోమీ, జెనికా బయోసైన్స్, ప్రొంజ్ బయోసైన్స్, బొల్ట్జ్మాన్ ల్యాబ్స్ ఉన్నాయి. కొత్త ఆలోచనలను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తున్నదని శ్రీధర్‌బాబు వివరించారు.