హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పర్యాటక వైభవాన్ని చాటేలా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. రామప్ప దేవాలయంతో భూదాన్ పోచంపల్లి గ్రామ విశిష్టతను చాటేలా అంతర్జాతీయ వేదికలపై ప్రచారం నిర్వహించాలని చెప్పారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ నిర్వాహణపై గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. లండన్‌లో నవంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు జరగబోయే డబ్ల్యూటీఎంలోనూ తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రామప్పకు స్పెషల్ బస్సు ప్యాకేజీతోపాటు నాగార్జునసాగర్- శ్రీశైలం- నాగార్జునసాగర్ రివర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురావాలని టూరిజం ఎండీ మనోహర్‌ను మంత్రి ఆదేశించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీళ్లు నిండుగా ఉన్నందున వీలైనంత త్వరగా ఈ ప్యాకేజీని అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. హైదరాబాద్- నాగార్జునసాగర్- శ్రీశైలం- హైదరాబాద్ ప్యాకేజీలో అన్ని వసతులతో కలిపి పెద్దలకు రూ.4,499, పిల్లలకు రూ.3,600 చార్జి నిర్ణయించినట్టు మంత్రి వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి కృయిజ్ బోట్లో వెళ్లాలనుకుంటే అదనంగా రూ.2,000 చెల్లించేలా ప్యాకేజీని తీర్చిదిద్దామన్నారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 180042546464 లేదా 9848540371 సంప్రదించవచ్చని తెలిపారు.
పాలమూరు, సెప్టెంబర్ 1: మన్యంకొండ క్షేత్రం దిగువన పర్యాటకుల సౌకర్యార్థం రూ.15 కోట్లతో బడ్జెట్ హోటల్ నిర్మిస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. పాలమూరులోని మన్యంకొండ స్టేజీ సమీపంలోని అలివేలు మంగతాయారు ఆలయానికి సమీపంలో హోటల్ కోసం ప్రతిపాదిత స్థలాన్ని గురువారం అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.