హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): దేశంలోనే మొట్టమొదటి ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుకు తెలంగాణ సిద్ధమవుతున్నది. ఔషధ, జీవశాస్ర్తాల రంగాల్లో రారాజుగా ఉన్న రాష్ట్రం మరో ఘనతను అందుకోబోతున్నది. ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలపటంతో అధికార యంత్రాంగం తదుపరి కార్యాచరణను సిద్ధం చేస్తున్నది. రాష్ట్రంలో ఔషధ వర్సిటీ ఏర్పాటైతే దేశంలో మొదటి, ప్రపంచంలో మూడోది అవుతుంది. ఇప్పటికే డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా, ఫార్మా హబ్‌గా, వ్యాక్సిన్ హబ్ ఆఫ్ ఇండియాగా ఉన్న హైదరాబాద్‌లో ఈ వర్సిటీ ఏర్పాటుతో హైదరాబాద్ ఖ్యాతి మరో మెట్టు పెరుగుతుంది. ముచ్చర్ల ఫార్మా సిటీలోనే దీన్ని ఏర్పాటు చేసే అవకాశమున్నదని అధికార వర్గాలు చెప్తున్నాయి.
రాష్ట్రంలో 150 దాకా ఫార్మా కాలేజీలు ఉండగా, ఏటా దాదాపు 10 వేల మంది ఫార్మా కోర్సులు చదువుతున్నారు. సుమారు 560 జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలు హైదరాబాద్ చుట్టుపక్కల కొలువుదీరాయి. దీనికితోడు హైదరాబాద్ సమీపంలోని ముచ్చర్లలో దాదాపు 19 వేల ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద ఫార్మాసిటీని కూడా ఏర్పాటుచేస్తున్నారు. వెరసి హైదరాబాద్ ఫార్మా హబ్‌గా ఖ్యాతి గడించింది. ఇక్కడ వివిధ రకాల ఔషధాలు, వ్యాక్సిన్లు తయారై, ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఔషధాల తయారీకి తగిన ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులు ఇక్కడ ఉన్నందునే ప్రపంచ కంపెనీలు ఇక్కడికొస్తున్నాయి. ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికా పర్యటన సందర్భంగా పలు ఔషధ, ఆర్అండ్డీ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడమే నిదర్శనం.
రాష్ట్రంలో ఇప్పటికే పలు కేంద్ర సాంకేతిక విశ్వవిద్యాలయాలకుతోడు తెలుగు యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇతర వర్సిటీలు ఉన్నాయి. అలాంటిది వేగంగా వృద్ధి చెందుతున్న ఫార్మా రంగానికి వర్సిటీ లేకపోవటం పెద్ద లోటు అని ఔషధ రంగ నిపుణులు చెప్తున్నారు. మన రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఫార్మా యూనివర్సిటీ దేశంలో మొట్టమొదటి ఫార్మా యూనివర్సిటీ అవుతుంది. ప్రపంచంలో జపాన్, చైనా తర్వాత మూడో విశ్వవిద్యాలయంగా నిలుస్తుంది.
ఫార్మా వర్సిటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అనేక అనుకూలతలున్నాయి. దేశంలోని అన్ని నగరాలతో అనుసంధానించేలా రోడ్డు, రైలు, విమాన సౌకర్యాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రధాన నగరాలకు నేరుగా విమాన సౌకర్యం ఉన్నది. ఇక్కడ ఔషధ వర్సిటీ ఏర్పాటైతే విద్యార్థులకు నాణ్యమైన ఫార్మసీ విద్య అందుతుంది. రాష్ట్రంలోని 150 ఫార్మసీ కాలేజీలు వర్సిటీ పరిధిలోకి వస్తాయి. ఫార్మా పరిశ్రమలకు అనుబంధంగా అవసరమైన కోర్సులను అభివృద్ధి చేసి ఈ వర్సిటీ నైపుణ్యం ఉన్నవారిని తయారుచేస్తుంది. పరిశోధనలో అత్యాధునిక పద్ధతులు పాటించే ఆస్కారం కలుగుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఫార్మాసిటీకి అనుబంధంగా యూనివర్సిటీ కూడా ఏర్పాటైతే పరిశ్రమకు, విద్యాసంస్థలకు అనుసంధానంగా ఉంటుంది.
వర్సిటీ ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఫార్మసీ విద్యకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుంది. ఔషధ, పరిశోధన సంస్థలకు మరింత నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులోకి వస్తాయి. ఔషధ పరిశ్రమకు, విద్యాసంస్థలకు అనుసంధానంగా ఉంటూ, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సులను అందుబాటులోకి తెచ్చే వీలు కలుగుతుంది. దేశ, విదేశాలకు చెందిన ఫార్మసీ విద్యార్థులకు హైదరాబాద్ కేంద్రంగా మారుతుంది. ఔషధ, జీవశాస్త్ర రంగాలు మరింత వేగంగా వృద్ధి చెందేందుకు ఆస్కారం కలుగుతుంది. పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాల ఫలితంగా ఔషధ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో పరిశ్రమకు అవసరమైన మానవ వనరులను తయారు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఫార్మా యూనివర్సిటీ ఆ లోటును పూడ్చుతుంది
– ఆకుల సంజయ్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడు