Nandini Sidda Reddy | హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తల్లి రూపం మార్చి, బతుకమ్మను తొలగించడం రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవానికి చెరగని మచ్చ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సంస్కృతిని హననం చేసి ప్రభుత్వం నుంచి సన్మానం చేయించుకోలేనన్న ప్రముఖ కవి నందిని సిధారెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తెలంగాణలోని ప్రతి పౌరుడికి గర్వకారణమని కొనియాడారు. తెలంగాణ ఆత్మగౌరవం, సంస్కృతి పరిరక్షణకు సిధారెడ్డి చూపిన నిబద్ధతకు బుధవారం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఆత్మగౌరవ పరిరక్షణ ఉద్యమంలో సిధారెడ్డి మార్గదర్శకత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని వెల్లడించారు.
కోటి రూపాయల కన్నా కోట్లాది ప్రజల గుండెల్లో కొలువైన తెలంగాణ తల్లే మిన్న అని హరీశ్‌రావు అన్నారు. బతుకమ్మను తీసేయడం అంటే తెలంగాణ బతుకును అవమానపరచడమేనని పేర్కొంటూ ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించిన నందిని సిధారెడ్డిని బుధవారం ఆయన ఎక్స్ వేదికగా అభినందించారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని చాటిన నందిని సిధారెడ్డికి ఉద్యమాభినందనలు తెలిపారు.