Shame shame | తెలంగాణలో రాహుల్‌గాంధీ జోడో యాత్ర అభాసుపాలవుతున్నది. రాహుల్ యాత్రలో తెలంగాణ తల్లికి తీరని అవమానం ఎదురైంది. అటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించకపోవడం.. ఇటు టీఆర్ఎస్ ఫ్లెక్సీలను చించడం.. తీవ్ర విమర్శలను కాంగ్రెస్ ఎదుర్కొంటున్నది. రాహుల్ యాత్రకు ఆర్భాటాలు చేసిన స్థానిక కాంగ్రెస్ నేతలు.. స్వర్గీయ నర్సిరెడ్డికి నివాళులు అర్పించాలన్నది కూడా మరిచి పోయి తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు.
రాహుల్ జోడో పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతున్నది. తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ పాదయాత్ర.. టై రోడ్డు వరకు అట్టహాసంగా కొనసాగింది. ఆ తర్వాత జనం పలుచబడిపోయారు. పాదయాత్రలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే రాహుల్ గాంధీ తెలంగాణలో నాలుగు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినా.. తెలంగాణ తల్లి విగ్రహం వైపు కన్నెత్తి చూడలేదు. స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా ఆవిష్కరణ విషయాన్ని పట్టించుకోలేదు.
అలాగే, మావోయిస్టుల చేతిలో దారుణహత్యకు గురైన కాంగ్రెస్ మక్తల్ మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి విగ్రహాన్ని కూడా కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదు. విగ్రహానికి కనీసం పూలమాల వేయాలన్న సోయి కూడా వీరిలో లేకపోయింది. దివంగత నేతకు ఇచ్చే విలువ ఇదేనా అని కాంగ్రెస్ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి. నర్సిరెడ్డి విగ్రహం రాహుల్ యాత్ర మార్గంలోనే ఉన్నప్పటికీ ఆ విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమం చేపట్టకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
టీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించివేత
రాహుల్ జోడో యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు కొంత మంది అత్యుత్సాహం ప్రదర్శించారు. టీఆర్ఎస్ నాయకులు ఏర్పాటుచేసుకున్న ఫ్లెక్సీలను చింపివేయడం వివాదాస్పదమైంది. కర్ణాటక నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే చోట కర్ణాటకకు చెందిన పలువురు అభిమానులు ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పేరు మీద భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జోడో యాత్ర కొనసాగే ఈ మార్గంలో కేసీఆర్ ఫ్లెక్సీ రాహుల్‌గాంధీ కంటపడకుండా ఉండాలని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆ ఫ్లెక్సీని చింపేశారు. తాము ఏర్పాటు చేసుకున్న బ్యానర్లు, ఫ్లెక్సీలను చించే అధికారం కాంగ్రెస్ నేతలకు ఎక్కడిదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జాతీయ పార్టీ బీఆర్ఎస్ ని ప్రకటించిన నేపథ్యంలో కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో శక్తి నగర్ పట్టణంలో భారీ ఫ్లెక్సీని కర్ణాటక బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేశారు.