Harish Rao | సింగరేణి కోల్ మైన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఆర్పీ, పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారుల ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సింగరేణి చరిత్రలో కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేయడం చూశాం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్ల నేడు అధికారులు సైతం సమ్మెకు దిగి రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు చేయాల్సిన దుస్థితి రావడం బాధాకరమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులకు క్రమం తప్పకుండా ప్రతి ఏటా పీఆర్పీ (పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) చెల్లించాం, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత రెండేళ్లుగా పీఆర్పీ నిలిపివేసి అధికారుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు.
పీఆర్పీ ఇస్తే అధికారుల్లో ఉత్సాహం పెరిగి ఉత్పత్తి పెరుగుతుంది, కానీ రెండేళ్లుగా పీఆర్పీ నిలిపివేయడం వల్ల అధికారులు ఆందోళనకు గురై బొగ్గు ఉత్పత్తి భారీగా పడిపోయింది. సింగరేణిలో బొగ్గు నిల్వలు, ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల రాష్ట్రంలోని కేటీపీఎస్, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో కొన్ని యూనిట్లు మూతపడ్డాయి. ఈ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి, ఈ వర్షాకాలంలో కూడా తెలంగాణ డిస్కంలు బయట పవర్ ఎక్స్చేంజీల నుంచి కరెంటు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. దాదాపు 2,500 మంది అధికారులు నల్ల కండువాలు వేసుకుని ధర్నా చేస్తుంటే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయమన్నారు.
సింగరేణి ఎప్పుడూ కోల్ ఇండియా మార్గదర్శకాలను పాటించడం ఆనవాయితీ.. కాబట్టి కోల్ ఇండియాలో ఇప్పటికే అమలు చేసిన ‘పే అప్‌గ్రేడేషన్’ విధానాన్ని ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే ఇక్కడ కూడా అమలు చేయాలి. గతంలో కేవలం పనితీరు, ప్రొడక్షన్ ఆధారంగా అత్యంత పారదర్శకంగా కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు జరిగేవి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పారదర్శకతను గాలికొదిలేసి బదిలీల్లో రాజకీయ జోక్యంతో అవినీతికి వత్తాసు పలుకుతోందని ఆరోపించారు.
పీఆర్పీ నిధులను విడుదల చేసి సమ్మె విరమింపజేయాలి..
గతంలో సింగరేణి సీఎండి లేదా డైరెక్టర్లు మాత్రమే రివ్యూ మీటింగ్‌ల కోసం సెక్రటేరియట్‌కు వచ్చేవారు, కానీ నేడు జీఎంలు, కింది స్థాయి అధికారులు కూడా పోస్టింగ్‌ల కోసం పైరవీకారులను పట్టుకుని డిప్యూటీ సీఎం ఇంటి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. సింగరేణి సీఎండి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తక్షణమే ఆఫీసర్స్ అసోసియేషన్‌ను చర్చలకు పిలిచి, రెండేళ్లుగా బకాయి ఉన్న పీఆర్పీ నిధులను విడుదల చేసి సమ్మె విరమింపజేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
బదిలీలు, ప్రమోషన్లలో రాజకీయ జోక్యం తగ్గించి, కోల్ ఇండియా తరహాలో పాత పద్ధతిలో పారదర్శక కౌన్సెలింగ్ విధానాన్ని వెంటనే తీసుకురావాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. అధికారులు ఎవరూ అధైర్యపడవద్దు, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మీ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని భరోసానిచ్చారు.