హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను పరిష్కరించడం పాలకుల బాధ్యత. రాజ్యాంగానికి లోబడి పాలన సాగించడం విద్యుక్త ధర్మం. కానీ పాలకులంటే ప్రజల భుజాలపై ఊరేగే పెత్తందారుల్లా, ప్రజలను బానిసలుగా చూసే మనస్తత్వంతో కొందరు అమాత్యులుగా అందలమెక్కి రాజ్యమేలుతున్నారు. ప్రజలే యజమానులు, పాలకులు సేవకులు అని మర్చిపోయి… చిన్నంతరం, పెద్దంతరం లేకుండా నవ్విపోదురుగాక నాకేంటి..! అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యూరి యా కోసం రైతులు విలవిల్లాడిపోతుంటే ఏలికలు చేసిన ఎక్కిరింతలు చూసి.. తెలంగాణవాదులు, నెటిజన్లు… ‘వీళ్లా మన పాలకులు..?’ అని చీదరించుకుంటున్నారు.
ఓ మంత్రి మాట్లాడుతూ ‘నాకు తెలిసీ బజారెక్కేవాడు పొలంలో ఉండేవాడు కాదు… నిజంగా యూరి యా కోసం వచ్చిన వాడు, పాపం.. కొనుక్కొని వెళ్తున్నాడు. ఆడితో గొడవ లేదు మాకు’ ఇదీ.. ఒక మంత్రి మాట. ‘అసలేం మాటలవి? అన్నదాతను పట్టుకొని వాడు.. వీడు… ఆడు.. అనడం ఏమిటి? ఇంత అహంకారమా? ఇంత నోటి దురుసా? అతడి కండ్లకు మనుషులు కనిపించరా?’ అని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. పెద్ద మోతుబరి రైతు అని చెప్పుకుని తిరిగే ఆ మంత్రికి.. సాటి రైతులంటేనే కాదు.. అధికారులంటే కూడా లెక్కేలేదు. అతడు ఏమన్నాడో చూద్దాం. ‘కాళేశ్వరం పంపులు ఆన్చేసేవోడు ఒకడుంటాడు. వాడే పంపులు ఆన్ చేస్తాడు’ అదీ ఆయన భాష. మంత్రిగారి భాషా వ్యాకరణంలో వాడు, వీడు తప్ప.. అతడు, ఆయన, వారు, వీరు అనేవి ఉండనే ఉండవు అని నెటిజన్ల నుంచి సెటైర్లు పేలుతున్నాయి.
రాష్ట్రంలో ఆ మోతుబరి మంత్రే కాదు.. మిగిలిన మంత్రులు కూడా పెత్తందారీతనానికి ఏమీ తీసిపోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎరువుల కోసం ఇన్ని ఆందోళనలు జరుగుతున్నా.. వారి దగ్గరకు వెళ్లి సర్ది చెప్పిన మంత్రి లేరు. క్యూలైన్లలో కావాలనే చెప్పులు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారంటాడు ఇంకో మంత్రి. క్యూ అంటే పొద్దున ఉండాలి కానీ.. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు ఏమిటి? అంటాడు మరో మంత్రి. ఎరువులు తేవడం చేతకాదు కానీ అడిగిన రైతు మీదికి లాఠీలు లేపడమే మంత్రులకు తెలిసిన పని అని రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.