హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : ప్రాణహిత చేవెళ్ల పథకంలో భాగంగా తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో అత్తెసరు నిధులనే కేటాయించింది. ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టుకే నిధులను విదల్చలేదు. ప్రాణహితకు కేవలం రూ. 52.62 కోట్లను మాత్రమే కేటాయించడంతో ఇప్పట్లో ప్రాజెక్టును ప్రారంభించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తేలిపోయింది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గానికి సాగునీటిని అందించే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ స్కీమ్‌కు మాత్రం రూ. 1,101 కోట్లను కేటాయించింది. రాష్ట్ర ప్రగతిలో అత్యంత ప్రాధాన్యం కలిగిన సాగునీటి రంగానికి కేటాయింపుల్లో ప్రభుత్వం భారీగా కోతను విధించింది.
నిరుటితో పోల్చితే ప్రస్తుత బడ్జెట్లో రూ.700 కోట్లను కుదించింది. గత రెండున్నరేండ్లుగా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. గతంలో చేసిన పనుల బిల్లులను మంజూరు చేయడంలేదు. కనీసం ఈ బడ్జెట్లోనైనా భారీగా నిధులను కేటాయిస్తారని భావించినా నిరాశ పరిచింది. సాగునీటి రంగానికి మొత్తంగా రూ.22,615 కోట్లను మాత్రమే కేటాయించింది. అందులో రూ.10,743 కోట్లు నిర్వహణ పద్దు కాగా, పెట్టుబడి వ్యయం కేవలం రూ.11,873 కోట్లుగా పేర్కొంది. గత బడ్జెట్లో ప్రాజెక్టులకు మొత్తంగా రూ.9,953 కోట్లను కేటాయించగా, ప్రస్తుతం రూ.7,784 కోట్లను మాత్రమే ప్రతిపాదించింది. ఇక గత బడ్జెట్లో ఇరిగేషన్‌శాఖకు రూ.23,373 కోట్లను కేటాయించగా, అందులో ఇప్పటివరకు రూ.13 వేల కోట్లకు మించి విడుదల చేయలేదు.
బడ్జెట్ కేటాయింపుల్లో సింహభాగం నిధులు మూడు జిల్లాలకే జరుగడం గమనార్హం. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాజెక్టులకే ప్రభుత్వం పెద్దపీట వేసినట్టు తెలుస్తున్నది. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్ నారాయణపేట లిఫ్ట్, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, ఆర్డీఎస్ లింక్ కెనాల్ ప్రాజెక్టు పనులకు నిధులను కేటాయించింది. ఇక నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ, దిండి, ఎన్ఎస్పీ లిఫ్ట్, ఎర్రుపాలెం లిఫ్ట్ స్కీమ్‌లకు, ఖమ్మం జిల్లాలో ఎస్సారెస్పీ స్టేజ్ 2 ప్రాజెక్టులకే నిధులను కేటాయించింది. చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుకు రూపాయి కూడా విదల్చలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.230 కోట్లు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌కు రూ.1,800 కోట్లు, దేవాదులకు రూ.445 కో ట్లు, సీతారామకు కేవలం రూ.336 కోట్లు, వరద కాలువ, చిన్నకాళేశ్వరం, కుప్టితోపాటు పలు ప్రాజెక్టులకు మాత్రమే కొద్దిమేర నిధులను విదిల్చింది. కాళేశ్వరం, చనాక కొరాట, నీల్వాయి, మత్తడి, ర్యాలివాగు, జగన్నాథ్‌పూర్, కాళేశ్వరం, నిజాంసాగర్ ఆధునికీకరణకు కొద్దిమేరకే నిధులు కేటాయించింది.