Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): నేరానికి పాల్పడిన వారిలో ఎవరినీ ఉపేక్షించబోం… వారి వెనుక ఎంతటి పెద్దవాళ్లు ఉన్నా వదిలిపెట్టబోం. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకుని న్యాయస్థానం ముందు నిలబెడుతాం. చట్టం తనపని తాను చేసుకుపోతుంది. చట్టం ముందు అందరూ సమానమే ఇవీ.. ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసులు చెప్పే మాటలు. కానీ హైదరాబాద్ నగర, తెలంగాణ రాష్ట్ర పోలీసుల (Telangana Police) తీరు ఇందుకు భిన్నంగా ఉందా? అని పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందా.. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పినప్పుడు మాత్రమే చేసుకుపోతుందా? అని నిలదీస్తున్నారు. ఇటీవల పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారిన వీఐపీల కేసుల సంగతి ఎందుకు తేల్చడంలేదని ప్రశ్నాస్ర్తాలు సంధిస్తున్నారు.
మంత్రి ఓఎస్డీ కేసు ఏమైంది?
మంత్రి కొండాసురేఖ ఓఎస్డీగా పనిచేసిన సుమంత్.. దక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను గన్‌తో బెదిరించి, డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారమంతా సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడు రోహిణ్‌రెడ్డి కార్యాలయంలో జరిగినట్టు ప్రచారం జరిగింది. ప్రభుత్వం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు మంత్రి సురేఖ ఇంటికి వెళ్లారు. సుమంత్ తమ ఇంట్లోనే ఉన్నాడని, కానీ అరెస్ట్ చేయడానికి అంగీకరించబోమని సురేఖ కూతురు సుస్మితా మీడియా ముందే పోలీసులకు చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సోదరులు భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. సురేఖ శాఖలో సీఎం సోదరులు ఇన్వాల్వ్ అవుతున్నారని తెలిపారు. అక్కడ గంటల తరబడి హైడ్రామా నడిచింది. ఈ క్రమంలో కొండా సురేఖ తన వాహనంలోనే సుమంత్‌ను వెంటబెట్టుకుని వెళ్లిపోయారు. అసలు సుమంత్‌ను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులు.. అతడు కనిపించినా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అనేది బేతాళప్రశ్న. గన్‌తో బెదిరించడం తీవ్రమైన నేరం కదా.. మరి ఆ కేసు ఏమైంది? అని ప్రజానీకంలో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
వరంగల్‌లో కొండా సురేఖ అనుచరుడు నవీన్రాజ్పై బెదిరింపుల కేసు నమోదైన తర్వాత.. మరోసారి సుమంత్ వ్యవహారం తెరపైకి వచ్చింది. కానీ ఏ కేసును కూడా పోలీసులు కొలిక్కి తీసుకురాలేదని తెలిసింది. సుమంత్ గన్ బెదిరింపుల వ్యవహారంలో ఆ గన్ ఎక్కడిది..? కొండాసుస్మిత సంచలన ఆరోపణలపై దర్యాప్తు ఎందుకు జరపలేదు..? అవును.. కొండాసురేఖ, పొంగులేటి మీడియా ముందుకు వచ్చి.. మనస్పర్థలు సమసిపోయాయని చెప్తే.. వీరి మధ్య సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సయోధ్య కుదిర్చితే.. తీవ్రమైన కేసులను కూడా పోలీసులు అటకెక్కిస్తారా..? అని ప్రజాసంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ఉంటూ.. ప్రజాధనం ఖర్చు పెట్టడంలో జరిగిన అవకతవకలలు, అధికారిక వ్యవహారాల్లో అక్రమాలకు సొంతంగా సయోధ్య కుదుర్చుకోవడం ఏంటో.. కాంగ్రెస్ పాలకులకే తెలియాలని ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాల నేతలు అంటున్నారు.
దొంగ ఇంట్లోనే పోలీసు దొంగతనం!
ఫిల్మ్‌నగర్ పీఎస్‌కు చెందిన కొందరు పోలీసులే చోరీకి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన వింత కేసులోనూ ఏమీ తేలలేదు. వివరాల్లోకి వెళ్తే నకిలీ ఐఏఎస్‌గా చెలామణి అయిన బత్తిన శశికాంత్ అనే వ్యక్తిని పట్టుకునేందుకు షేక్‌పేటలోని అతడి ఇంటికి వెళ్లిన పోలీసులు.. తనిఖీలలో కనిపించిన రోలెక్స్ వాచ్‌ను పెద్దసార్కు గిఫ్ట్ ఇద్దామని తస్కరించారట. ఆ ఇంట్లో కొట్టేసిన చాలా విలువైన వస్తువులు పంచుకునే క్రమంలో వివాదం తలెత్తడంతో కొట్టేసిన మొత్తం వస్తువుల గుట్టు బయటపడిందట. ఆ తర్వాత కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి, వాచ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కానీ తనిఖీల తతంగమంతా నడిపిందెవరు? వీడియోగ్రఫీ తీస్తున్నా ఉన్నతాధికారికి తెలియకుండానే ఇదంతా జరిగిందా? ప్రెస్‌మీట్‌కు ముందే స్వాధీనం చేసుకున్న వస్తువులను, వీడియోలను పైఅధికారులకు చూపించలేదా? అనేది పోలీసుశాఖలోనే చర్చ జరుగుతున్నది.
ఈ వ్యవహారంలో కానిస్టేబుల్‌ను బలి చేశారని, అసలు సూత్రధారులను పక్కకు తప్పించారని, పెద్దసార్ పేరు కూడా బయటకు రావడంతోనే కారణమని గుసగుసలు వినిపించాయి. ఇప్పటికీ పోలీసు వర్గాల్లో రోలెక్స్ వ్యవహారంపై పెద్ద చర్చ జరుగుతున్నది. సోషల్‌మీడియాలో విమర్శలు చేసిన వాళ్లపై కూడా విరుచుకుపడుతూ, ప్రజల తరఫున గొంతెత్తే వారిని అరెస్టు చేస్తూ ప్రతాపం చూపిస్తున్న పోలీసులు… కీలకమైన, తీవ్రమైన నేరాల్లో వీఐపీలను ఎందుకు వదిలేస్తున్నారని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
పైసలిస్తే ఎవరినైనా వదిలేస్తరా?
పెట్టుబడులు, అధిక లాభాల పేరుతో ఆశచూపి సుమారు రూ.3వేల కోట్ల భారీ మోసానికి పాల్పడిన ఆర్థిక నేరంలో పోలీసులు సతీశ్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అక్టోబర్‌లో ప్రత్యేక బృందాలు మహారాష్ట్రకు వెళ్లి నిందితుడిని పట్టుకున్నాయి. కానీ నిందితుడిని హైదరాబాద్ తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ ఎస్సై శ్రీకాంత్ రూ.2 కోట్లు లంచం తీసుకుని… నిందితుడిని వదిలేశాడు. కానీ నిందితుడు తన నుంచి పారిపోయాడంటూ ఎస్సై డ్రామా ఆడాడు. డీల్ వ్యవహారం బయటపడడంతో సస్పెండ్ అయ్యాడు. ఇంత పెద్ద వ్యవహారంలో కేవలం ఎస్సై పాత్ర మాత్రమే ఉందా? అతడి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? పోలీసుశాఖలో ఒక పెద్దమనిషి సహకారం ఉన్నదనే ఆరోపణల్లో వాస్తవమెంత? అనేది పోలీసు వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. ప్రజలను మోసం చేసిన భారీ ఆర్థిక నేరంలో… కొందరు అధికారులకు ముడుపులు ముట్టడం వల్లే… అంతా కూడబలుక్కునే నిందితుడిని వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.