హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): మామిడి కాయల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తున్నది. మామిడి తోటల సాగు విస్తీర్ణంలో దేశంలోనే తొమ్మిదో స్థానంలో నిలిచిన తెలంగాణ.. ఉత్పత్తిలో మాత్రం ఐదో స్థానంలో నిలవడం విశేషం. 2021-22 సంవత్సరానికి తెలంగాణలో 3.21 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు సాగు కాగా 11.65 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి అయింది.
దేశవ్యాప్తంగా మామిడి సాగు, ఉత్పత్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్సభలో వెల్లడించింది. తెలంగాణలో క్రమంగా మామిడి సాగు, ఉత్పత్తి పెరుగుతున్నట్టు తెలిపింది. మామిడి ఉత్పత్తిలో 47.27 లక్షల టన్నులతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 46.62 లక్షల టన్నులతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో, 16.46 లక్షల టన్నులతో కర్ణాటక మూడో స్థానంలో, 15.49 లక్షల టన్నులతో బీహార్ నాలుగో స్థానంలో నిలిచాయి.