Telangana | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో, పెట్టుబడుల ఆకర్షణలో వేగంగా దూసుకెళ్తున్నది. ప్రపంచ ప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరుకు పార్టీలకు అతీతంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రెండున్నర నెలల్లోనే వేగంగా తమ కంపెనీకి అనుమతులు ఇవ్వడం పట్ల ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ చైర్మన్, సీఈవో సిడ్నీ లియూ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏ రాష్ట్రమూ ఇంత స్పీడ్‌గా సానుకూలంగా స్పందించలేదని పేర్కొన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అందరూ ఒప్పుకొని తీరాల్సిందేనని ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ జనరల్ సెకట్రరీ, మాజీ బ్యూరోక్రాట్ పీవీఎస్ శర్మ తెలిపారు. తెలంగాణలో ఇంత అభివృద్ధి ఇంతకు ముందెన్నడూ చూడలేదని ఆయన ట్విట్టర్ వేదికగా మెచ్చుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న కొత్త ప్రణాళికలను ఒప్పుకోవాల్సిందేనని అన్నారు. సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు స్వరాష్ట్రం అభివృద్ధి పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నదని కొనియాడారు. వారి సమిష్టి కృషివల్ల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ద్వయం ఘనత అని ట్వీట్ చేశారు.
శాంతియుత తెలంగాణ: అసదుద్దీన్ ఒవైసీ
శాంతియుత తెలంగాణగా మన రాష్ట్రం దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్నదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసించారు. ‘తెలంగాణవాసులకు అభినందనలు. ఇది పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు సాధించిన గొప్ప విజయం. 2014 నుంచి సీఎం కేసీఆర్ నాయకత్వానికి నిదర్శనం. శాంతియుత వాతావరణం, ఘనమైన మౌలిక సదుపాయాలు, అద్భుతమైన వ్యక్తులు, ప్రేమగా స్వాగతించే సంస్కృతి ఇక్కడ ఉన్నది. ఇలాంటి వాతావరణంలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడని వారెవరు?’ అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
పంటల ఉత్పత్తిలో తెలంగాణ టాప్: తోమర్
ఫాక్స్‌కాన్ కంపెనీ శంకుస్థాపనకు ముందురోజు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడుతూ.. పంటల ఉత్పత్తి, దిగుబడి పెరుగుదలతో, వ్యవసాయ రంగంలో తెలంగాణ ముందంజలో ఉన్నదని మెచ్చుకున్నారు. జూన్ 15 నుంచి 17 వరకు హైదరాబాద్‌లో జీ20 సదస్సు జరుగనున్న నేపథ్యంలో ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత్‌కు ఉన్న ప్రాధాన్యం చాటిచెప్పేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు.