హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): వినూత్నంగా ఆలోచించటంలో తెలంగాణ రాష్ట్రం ముందున్నదని, ఇదే తరహాలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కొనియాడారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీ ణ పేదరిక నిర్మూలనలో రాష్ట్రం బాగా పనిచేస్తున్నదని ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ) కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. ఈ సం దర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధిలో హార్టికల్చర్ కార్యక్రమాలకు ప్రాధా న్యం ఇవ్వాలని సూచించారు.
గ్రామాలను గ్రీన్ విలేజ్‌లుగా మార్చాలని, పల్లెల్లో కాలుష్య కారకాలను వాడకుండా చూడాలని తెలిపారు. ముందుగా ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన వాటిల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని వెల్లడించారు. గ్రామీణ పేదరిక నిర్మూలనలో భాగంగా జీవనోపాధిపై దృష్టి సారించాలని అన్నారు. వ్యవసాయేతర అంశాలపై మహిళలు దృష్టి సారించి ఆదాయాన్ని పెంచేలా చేయాలని, ఇందుకు గ్రామీణాభివృద్ధి శాఖ, స్త్రీనిధి, సెర్ప్‌ను భాగస్వామ్యం చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ డైరెక్టర్ హనుమంతరావు, గ్రామీణాభివృద్ధి స్పెషల్ కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.