మిర్యాలగూడ, జూలై 14 : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఏపీలోని చీరాలలో జరిగే ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ మార్గమధ్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేండ్లలో ఎనలేని అభివృద్ధి సాధించిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కారణంగానే నేడు పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భూగర్భ జలమట్టం సమృద్ధిగా పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధుతో రైతులకు పెట్టుబడి సాయం, రైతు చనిపోతే బీమా ద్వారా ఆదుకుంటున్నదని తెలిపారు. రైతులు పండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేసి అండగా నిలిచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు.
యాసంగి రూ.15 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించినట్టు చెప్పారు. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో ఉన్న ప్రజా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. ఆ రెండు పార్టీల నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వారు పాలిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ మాదిరిగా సంక్షేమ పథకాలు అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నీరు, విద్యుత్తుకు తీవ్ర కొరత ఉండేదని, ఎమ్మెల్యేలు ప్రజలకు వద్దకు వెళ్లేందుకు జంకేవారన్నారు. కానీ నేడు రాష్ట్రంలో సరిపడా నీరు, 24 గంటల కరెంటు ఇచ్చి సీఎం కేసీఆర్ ప్రజలకు ఆరాధ్యదైవంగా మారారని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి తదితరులు ఉన్నారు.