సుల్తాన్ బజార్, జూన్ 17: ‘ఒకరి తర్వాత ఒకరు.. ఒంటికొస్తే అంతే..’ శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ప్రత్యేక కథనాన్ని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 220 మంది విద్యార్థులు, 15 మంది ఉపాధ్యాయులందరికీ ఒకే మరుగుదొడ్డి ఉన్నది. అది కూడా అపరిశుభ్రతతో ఉన్నది.
ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దుస్థితిని నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చింది. వారి సమస్యలను కండ్లకు కట్టినట్టు వివరించింది. ఆ కథనాన్ని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించింది. ఆ అంశంపై జులై 28లోగా నివేదిక సమర్పించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.