GSDP | కొత్త దశకు.. ప్రగతి దిశకు నిలువెత్తు నిదర్శనం తెలంగాణ. ఇది గప్పాలకు పోతూ చెప్పుకుంటున్న మాట కాదు. యావత్తు భారతావని అంగీకరిస్తున్న వాస్తవం. తొమ్మిదేండ్ల ముందు పసికూనగా బుడిబుడి అడుగులతో నడకను ప్రారంభించిన తెలంగాణ.. ఇప్పుడు దేశానికే మార్గదర్శిగా నిలిచింది. దేశ ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా భావించే 12 అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి ఆద్యంతం అద్భుతమే. ఆ పన్నెండు విజయాల్లో ఒకటి జీఎస్డీపీ. తొమ్మిదేండ్లలో తెలంగాణ జీఎస్డీపీ పైపైకి పాకిన తీరుతెన్నులు మీకోసం…
ఒక రాష్ట్ర ప్రగతికి జీఎస్డీపీ, తలసరి ఆదాయమే ప్రామాణికం. దేశ జనాభాలో 2.9 శాతం వాటా మాత్రమే ఉన్న తెలంగాణ.. దేశ జీడీపీలో 4.9 శాతం వాటాను కలిగి ఉంది. 2013-14లో తెలంగాణ జీఎస్డీపీ రూ.3.79 లక్షల కోట్లుగా ఉంటే, 2023 నాటికి రూ. 13.28 లక్షల కోట్లకు చేరింది. తొమ్మిదేండ్లలో జీఎస్డీపీ మూడురెట్లు పెరిగింది. 2020-21లో ఒకవైపు కరోనా సంక్షోభం యావత్తు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసినా, కేంద్రం ఏకాణా ఇవ్వకున్నా తెలంగాణ మాత్రం వెనుదిరిగి చూడలేదు. ఆ సమయంలో దేశ జీడీపీ -1.4 శాతానికి పడిపోగా, రాష్ట్రం మాత్రం 1.2 వృద్ధిరేటును నమోదు చేసింది.
2014: రూ. 3.79 లక్షల కోట్లు
2023: రూ. 13.28 లక్షల కోట్లు
పెరుగుదల : 251 శాతం
విశేషం: ఒక్క ఏడాదిలో తెలంగాణ నమోదుచేసే జీఎస్డీపీతో మన పొరుగున ఉన్న భూటాన్ను 52 ఏండ్లపాటు పోషించవచ్చు.