హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం జరిగిన అరవై ఏండ్ల సుదీర్ఘ పోరాటానికి మన్మోహనుడి (Manmohan Singh) ప్రభుత్వంలోనే ముగింపులభించింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే నెరవేరింది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ డిసెంబర్ 9 ప్రకటన వెలువడింది. 1971లో తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తామని మాటతప్పిన కాంగ్రెస్ తప్పును 2014లో సరిదిద్ది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. తన ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ లేకున్నా అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును ఉభయసభల్లో గట్టెక్కించారు.
తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్ర నేతలు, ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర కేబినెట్లో ఉన్న ఏపీ నేతలు రాజీమానా చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. పార్లమెంటులో రచ్చజరిగినా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ చేయించేందుకు మన్మోహన్ సింగ్ కీలక భూమిక పోషించారన్నారు అప్పటి కేంద్రహోంమంత్రి షిండే అన్నారు.
ఇక అధికారం కోల్పోయాక కూడా విభజన సమస్యల పరిష్కారానికి మన్మోహన్ డిమాండ్ చేశారు. విభజన హామీలన్నింటిని నెరవేర్చాలన్నారు. ఇక, దశాబ్దాల పాటు తెలంగాణపై కొనసాగిన అణచివేత, ఆర్థిక దోపిడీ, సామాజిక, సాంస్కృతిక వివక్ష తెలిసిన అతికొద్ది మంది జాతీయ నాయకుల్లో మన్మోహన్సింగ్ ముందు వరుసలో ఉంటారు. తెలంగాణ ఆకాంక్షలను, రాష్ట్రం ఆవిర్భవించకపోతే జరిగే అనర్థాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పూసగుచ్చినట్టు వివరిస్తే అర్థం చేసుకున్న మనసున్న పాలకుడు మన్మోహన్ సింగ్.
త్రిమూర్తుల కూర్పు.. డిసెంబర్ 9 ప్రకటన
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన ప్రకటనను త్రిమూర్తుల కూర్పుగా చెప్పుంటారు. ప్రకటన చేసింది నాటి హోంమంత్రి చిదంబరమే అయినా.. కేసీఆర్కు, మన్మోహన్ సింగ్కు మధ్య వారధిగా జయశంకర్ సార్ ఉన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మద్దతు కూడగట్టడంలో కేసీఆర్కు మన్మోహన్ సింగ్ సూచనలు చేశారు.