Mumbai Metro Pillar : మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక మెట్రో పిల్లర్ కూలింది. ఈ ఘనటలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డట్లు ప్రాథమిక సమాచారం. స్థానిక ములుంద్ ప్రాంతంలోని, ఎల్బీఎస్ రోడ్, జాన్సన్ అండ్ జాన్సన్ ఫ్యాక్టరీ వద్ద నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ శనివారం మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో కూలిపోయింది.
కూలిన మెట్రో పిల్లర్ రోడ్డుపై వెళ్తున్న ఒక ఆటో రిక్షా, ఒక కారుపై పడింది. దీంతో ఈ వాహనాల్లోని ఒకరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీయే) అధికారులు, బీఎంసీ అధికారులు, మెట్రో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాయపడ్డవారికి పూర్తిస్థాయి వైద్య సహాయం అందిస్తామని అధికారులు ప్రకటించారు.
ఈ ప్రమాదం నేపథ్యంలో ములుంద్ ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. దీంతో ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. వాహనదారులు వేరే మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచించారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.