Telangana | కొండారెడ్డిపల్లెలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై ఎట్టకేలకు మహిళా కమిషన్ స్పందించింది. ఈ సంఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూలు ఎస్పీకి మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద లేఖ రాశారు. నిందితులపై తీసుకున్న చర్యలను పేర్కొంటూ నివేదిక ఇవ్వాలని సూచించారు. కాగా, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదను కాంగ్రెస్ గూండాల చేతిలో దాడికి గురైన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి శుక్రవారం నాడు కలిశారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి వెళ్లిన మహిళా జర్నలిస్టులపై పట్టపగలే దాడి జరిగింది. కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 150 మంది వారిని చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ మీకేం పని అంటూ దౌర్జన్యానికి దిగారు. వారు రికార్డు చేసిన దృశ్యాలు బయటకు రాకుండా మెమొరీకార్డులు లాక్కున్నారు. పట్టపగలు సినిమాల్లోని వీధి గూండాలను తలపించారు. ఇంత జరిగాక, విషయం పోలీస్ స్టేషన్‌కు చేరాక కూడా వారిపై వేధింపులు ఆగలేదు. పోలీస్ స్టేషన్లోనే ఒకడు జర్నలిస్టుల్లో ఒకరిపై దాడికి యత్నించాడు. అయినా పోలీసులు చోద్యం చూశారు.
@SCWTelangana has taken cognizance of the reported incident at Kondareddypalle .Hon’ble Chairperson @sharadanerella garu written to @SpNagarkurnool to ensure fare and speedy investigation in the matter. A detailed action taken report must be apprised to the Commission at earliest
— Telangana State Commission for Women (@SCWTelangana) August 23, 2024
కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామంలో మహిళా జర్నలిస్టులపై దాడి జరిగి, వారిపై హత్యాయత్నం జరిగితే రాష్ట్ర మహిళా కమిషన్ గురువారం నాడు స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో గతకొంత కాలంగా దళిత మహిళలపై జరిగిన అత్యాచారాలు, వేధింపులపై కమిషన్ స్పందించలేదని, కేవలం రాజకీయ ప్రేరేపిత అంశాలపై మాత్రమే స్పందిస్తున్నదన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఏదో రాజకీయ సభలో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రాజకీయం చేశారు. ఈ అంశాన్ని తాము సుమోటోగా తీసుకుంటున్నామని, దీనిపై కేటీఆర్ విచారణకు హాజరు కావాలంటూ మహిళా కమిషన్ ఎక్స్ వేదికగా పేర్కొన్న విషయం తెల్సిందే. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మహిళా జర్నలిస్టులపై దాడి, హత్యాయత్నం కేసులో మహిళా కమిషన్ స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. మహిళా కమిషన్ తీరుపై కొందరు జర్నలిస్టులు, మేధావులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం తామే వెళ్లి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, డీజీపీని కూడా కలుస్తామని చెప్పారు. ఈ క్రమంలో స్పందించిన మహిళా కమిషన్ చైర్మన్.. ఘటనపై పూర్తి వివరాలు అందజేయాలని నాగర్‌కర్నూలు ఎస్పీని ఆదేశించారు.