రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. తొలిపాట ‘చికిరి చికిరి’ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. మార్చి 27న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది. సంక్రాంతి కానుకగా రెండో పాటను విడుదల చేయబోతున్నారని తెలిసింది. ‘చికిరి చికిరి’ సూపర్‌హిట్ కావడంతో..రెండో పాట మీద మరింతగా అంచనాలు పెరిగాయి.
ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్న ఈ సినిమాలోని పాటలు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తాయని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఇదిలావుండగా ‘పెద్ది’ సినిమా అనుకున్న సమయానికి రాకపోవచ్చని, షూటింగ్ ఆలస్యం కారణంగా డిసెంబర్‌కి వాయిదా పడే అవకాశాలున్నాయని సోషల్‌మీడియాలో ప్రచారం మొదలైంది. అయితే ఈ పుకార్లలో వాస్తవం లేదని అంటున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రబృందం ఎట్టిపరిస్థితుల్లో సినిమాను వేసవికే విడుదల చేయాలనే సంకల్పంతో ఉందట. జాన్వీకపూర్, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, నిర్మాణం: వృద్ధి సినిమాస్, నిర్మాత: వెంకట సతీష్ కిలారు, సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా.