ఈ ఏడాది 1.18 కోట్ల టన్నులతో దేశంలో రెండో స్థానంలో రాష్ట్రం
వరుసగా మూడో సంవత్సరం
కోటి టన్నులకు పైగా కొనుగోలు
1.87 కోట్ల టన్నులతో మొదటి స్థానంలో పంజాబ్
గణాంకాలు వెల్లడించిన ఎఫ్‌సీఐ
ప్రైవేట్ కొనుగోళ్లు కలిపితే తెలంగాణదే మొదటి స్థానం!
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): దేశానికి అత్యధిక ధాన్యాన్ని అందించిన రెండో రాష్ట్రంగా తెలంగాణ ఈ ఏడాది కూడా రికార్డు సృష్టించింది. ధాన్యం కొనుగోళ్లలో ఎప్పటిలాగే పంజాబ్ మొదటి స్థానంలో నిలిచింది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) 2021-22లో తెలంగాణ నుంచి ఇప్పటివరకు 1.18 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో గత వానకాలం సీజన్లో 70.22 లక్షల టన్నులు, ప్రస్తుత యాసంగిలో 48 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. మరో మూడు, నాలుగు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. ఎఫ్‌సీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం పంజాబ్ నుంచి అత్యధికంగా 1.87 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఛత్తీస్‌గఢ్ నుంచి 92 లక్షల టన్నులు, ఉత్తరప్రదేశ్ నుంచి 65.53 లక్షల టన్నులు, ఒడిశా నుంచి 63.56 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 8.39 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ఎఫ్‌సీఐ తెలిపింది. తెలంగాణతో పాటు పలు రాష్ర్టాల్లో ఇంకా యాసంగి సీజన్ కొనుగోళ్లు కొనసాగుతున్నందున ఇది మరికొంత పెరిగే అవకాశం ఉన్నది.
కోటి టన్నులు దాటడం మూడోసారి
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ కోటి టన్నుల మార్క్‌ను దాటడం వరుసగా ఇది మూడో ఏడాది. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు 2019-20లో మొదటిసారిగా కోటి టన్నుల మార్క్‌ను దాటాయి. 2020-21లో 1.41 కోట్ల టన్నులకు పెరిగింది. అయితే ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం కొర్రీలు పెట్టడం, బాయిల్డ్‌రైస్ కొనేదిలేదని భీష్మించడం, రాష్ట్ర ప్రభుత్వం పంట మార్పిడికి రైతులను ప్రోత్సహించడం తదితర కారణాల వల్ల ఈ యాసంగిలో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. లేదంటే ధాన్యం కొనుగోళ్లు కోటిన్నర టన్నుల మార్క్‌ను దాటి ఉండేవని అధికారులు భావిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంటుందని అధికారులు, మిల్లర్లు భావిస్తున్నారు. ఎఫ్‌సీఐ 1.18 కోట్ల టన్నులను కొనుగోలు చేయగా, ప్రైవేట్ వ్యాపారులు, రైస్ మిల్లర్లు, ఇతర రాష్ర్టాలవారు రెండు సీజన్లలో కలిపి దాదాపు 60 నుంచి 65 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు మిల్లర్లు చెప్తున్నారు. వీటిని కూడా పరిగణనలోనికి తీసుకొంటే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ను మించిపోయినట్టేనని అధికారులు పేర్కొంటున్నారు. నిరుడు పంజాబ్‌లో 2.02 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా తెలంగాణలో సుమారు 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినట్టు అంచనా. తెలంగాణ ఈ ఘనతను సాధించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగం పట్ల అనుసరించిన సానుకూల, పురోగామి విధానాలే కారణమని విశ్లేషిస్తున్నారు.
ఈ ఘనత సీఎం కేసీఆర్‌దే
తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోళ్లు, ఉత్పత్తిలో దేశంలో అగ్రగామిగా నిలిచిందంటే అందుకు సీఎం కేసీఆర్ చేసిన కృషే కారణం. ముఖ్యమంత్రి ముందుచూపుతో తెలంగాణ సాగునీటి కష్టాలను తీర్చారు. రైతుబంధు రూపంలో రైతులకు అండగా నిలిచారు. ఇలాంటి చర్యలతోనే ఇప్పుడు తెలంగాణ పంజాబ్‌ను ఢీ కొట్టేస్థాయికి చేరింది.
–పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్