రాజన్న సిరిసిల్ల, జనవరి 4 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 డిసెంబర్ నెలకు కేంద్రం ప్రకటించిన 4 స్టార్ క్యాటగిరీ ర్యాంకింగ్స్‌లో దేశంలోనే తొలి మూడు స్థానాలను తెలంగాణ జిల్లాలు దక్కించుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రథమ స్థానం, కరీంగనర్ జిల్లాకు ద్వితీయ స్థానం, పెద్దపల్లి జిల్లాకు తృతీయ స్థానం లభించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి కేంద్ర ప్రభుత్వ తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ ట్విట్టర్లో పోస్టు చేసింది.
ఇండ్లలో మరుగుదొడ్ల వాడకం, అన్ని గ్రామాల్లో తడి, పొడిచెత్త, కంపోస్టు షెడ్లు, మురుగునీరు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం నిర్వహణ తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ ర్యాంకింగ్స్ ప్రకటించారు. రాష్ట్రంలోని మూడు జిల్లాలు ఈ ఘనతను సాధించిన నేపథ్యంలో పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా తెలంగాణ కీర్తిని చాటినందుకు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు పంచాయతీ అధికారులు, సిబ్బంది, కలెక్టర్లు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.