హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని స్వయం సహాయక మహిళా సంఘాల (సెర్ప్) కోసం ప్రత్యేకంగా రూపొందించిన అకౌంటింగ్ యాప్ కేంద్రం దృష్టిని ఆకర్షించింది. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల కోసం కేంద్ర ప్రభుత్వం లోకోస్ అకౌంటింగ్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ గురించి వివిధ రాష్ర్టాల్లోని మహిళలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ నుంచి 120 మంది మహిళలను ఎంపిక చేస్తుండటం విశేషం. ఇంటర్, పదో తరగతి చదివి, హిందీ మాట్లాడటం వచ్చినవారిని ఇందుకు ఎంపిక చేయనున్నారు. వీరిని కేంద్రం సూచించిన రాష్ర్టాలకు బ్యాచ్‌లవారీగా పంపించి అక్కడి మహిళలకు యాప్ వినియోగంపై శిక్షణ ఇప్పించనున్నారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులు బ్యాంక్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ యాప్ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. ఈ యాప్‌ను తీసుకొచ్చిన తరువాత మహిళా సంఘాల లావాదేవీల్లో పారదర్శకత, నగదు జమ, చెల్లింపుల్లో వేగం పెరిగింది. రాష్ట్రంలో ఈ యాప్ విజయవంతం అవ్వడంతో దీనిని స్ఫూర్తిగా తీసుకొని నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ (ఎన్ఆర్ఎల్ఎం) అధికారులు జాతీయ స్థాయిలో లోకోస్ యాప్‌ను రూపొందించారు.