కరీంనగర్, జూలై 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధకాండ మొదలుపెట్టిందని, జనజీవన స్రవంతిలో కలిసిన విప్లవ సంఘాల మాజీ నాయకులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా పోలీస్ బృందాలను ఏర్పాటు చేసిందనే వాదనలు వస్తున్నాయి.
సికాస మాజీ నాయకుడు రమాకాంత్ అలియాస్ మహ్మద్ హుస్సేన్ అలియాస్ సుధాకర్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదేండ్లుగా ప్రజాజీవితంలో ఉన్న రమాకాంత్‌ను జమ్మికుంటలోని సొంత ఇంట్లో పోలీసులు దౌర్జన్యంగా చొరబడి, ఎలాంటి నోటీసు లేకుండా, బంధువులకు చెప్పకుండా జీపులో ఎక్కించుకొని పోయినట్టు మానవహక్కుల వేదిక లేఖ విడుదల చేసింది.
మందమర్రి, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ సానుభూతిపరులకు రమాకాంత్ కరపత్రాలు పంచుతుండగా అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ‘మాజీ’లపై నిర్బంధకాండకు శ్రీకారం చుట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాలు, పోరాటాలకు సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)పూర్తిస్థాయిలో మద్దతిచ్చింది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గనులపై పోరాటాలు చేసింది. తెలంగాణ ఆవిర్భావం, ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో అన్ని విప్లవ సంఘాలు దాదాపు తమ కార్యకలాపాలు తగ్గించాయి. ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయ, సహకారాలు అందించడంతో చాలామంది విప్లవ సంఘాల నాయకులు, సభ్యులు లొంగిపోగా వారికి సర్కారు చేయూతనిచ్చింది.
ఈ క్రమంలో చాలా మంది జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. తాజాగా రమాకాంత్ అరెస్టుతో లొంగిపోయిన మావోయిస్టులు, సానుభూతిపరులు, విప్లవ సం ఘాల నాయకుల్లో అలజడి మొదలైంది. పోలీసులు చెబుతున్నది నిజమే అయితే రమాకాంత్‌ను ముందుగా మందలించాల్సిందని, అలాంటిదేం లేకుండానే నేరుగా అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రమాకాంత్ అరెస్టుతో సింగరేణి వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. సికాస కార్యకలాపాలపై నిఘా, రమాకాంత్ అరెస్టు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తున్నది.
కరపత్రాలు పంచుతుండగా అరెస్ట్ చేశాం : ఏసీపీ
ఫర్టిలైజర్‌సిటీ/జమ్మికుంట/రామకృష్ణాపూర్ : మావోయిస్టు నేత మహ్మద్ హుస్సేన్ (అలియాస్ సుధాకర్ అలియాస్ రమాకాంత్)ను సోమవారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని ఆర్కే 1గని రోడ్లో అరెస్ట్ చేసినట్టు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ రవికుమార్ సోమవారం తెలిపారు.
రెండు నెలలుగా మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియాలో సికాస (సింగరేణి కార్మిక సమాఖ్య ) పునర్నిర్మాణం కోసం రమాకాంత్ కృషి చేస్తున్నాడని సమాచారం ఉందని, రామగుండం సీపీ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని చెప్పారు. మందమర్రి, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో మావోయిస్టు సానుభూతిపరులకు కరపత్రాలు పంచుతున్నట్టు తెలిసిందన్నారు.
బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్ఐ జీ రాజశేఖర్ సిబ్బంది సోమవారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఆర్కే 1 గని రోడ్లో బ్యాగ్‌తో ఉన్న వ్యక్తి వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నట్టు చెప్పారు. అతడిని తనిఖీ చేస్తే మావోయిస్టుల పేరు తో పోస్టర్లు, కరపత్రాలు లభించాయని, అదుపులోకి తీసుకొని విచారిస్తే జమ్మికుంటకు చెందిన మహ్మద్ హుస్సేన్ అని తేలిందని వివరించారు.
సింగరేణి కార్మికుడి నుంచి మావోయిస్టుగా..
మహ్మద్ హుస్సేన్ 1978 నుంచి 1981 వరకు కేకే-2 గనిలో జనరల్ మజ్దూర్‌గా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసి మావోయిస్టు పార్టీలో చేరాడు. ఉత్తర తెలంగాణ కమిటీ మెంబర్‌గా ఎదిగాడు. మావోయిస్టు అనుబంధ సంఘమైన సింగరేణి కార్మిక సమాఖ్య వ్యవస్థాపకసభ్యుడిగా, సీవోగా పనిచేశాడు. 2009లో ఝార్ఘండ్‌లో అరెస్టయి 2013 వరకు జైలు జీవితం గడిపాడు.
ఎందుకు తీసుకెళ్లారో చెప్పాలి : మానవ హక్కుల వేదిక
జమ్మికుంటలోని తన ఇంట్లో ఉన్న మహమ్మద్ హుస్సేన్‌ను సోమవారం తెల్లవారుజామున పోలీసులు దౌర్జన్యంగా చొరబడి జీపులో ఎక్కించుకొని వెళ్లిపోయారని మానవ హక్కుల వేదిక ఒక లేఖలో వెల్లడించింది. మఫ్టీలో వచ్చినవాళ్లు పోలీసులమని చెప్పటం తప్ప, ఎక్క డి నుంచి వచ్చారు?, ఎందుకు తీసుకెళ్తున్నారో కనీసం చెప్పలేదని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ర్టాల సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్ జీవన్‌కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య పేరిట విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
మహ్మద్ హుస్సేన్ పదేళ్లుగా సాధారణ, చట్టబద్ధమైన జీవనం సాగిస్తున్న సీనియర్ సిటిజన్ అని, ఒక పాత పరిచయస్తునికి కోర్టులో ష్యూరిటీ పడ్డాడనే ఏకైక కారణంతో పోలీసులు ఇలా అక్రమ పద్ధతుల్లో పట్టుకెళ్లడం పౌర హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పాలకులు వెంటనే కల్పించుకొని పోలీసుల దౌర్జన్యాన్ని ఆపించి హుస్సేన్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హుస్సేన్ ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత : హరీశ్
పదేండ్లుగా జన జీవన స్రవంతిలో ఉన్న మహ్మద్ హుస్సేన్ అలియాస్ రమాకాంత్ ప్రాణాలకు ఏదైనా జరిగితే ప్రభుత్వ మే బాధ్యత వహించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. హుస్సేన్ అరెస్టు తీరును ఖండిస్తూ సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
మహ్మద్ హుస్సేన్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మానవ హకులు, ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారని చెప్పారు. తక్షణమే డీజీపీ ఈ వ్యవహారంపై స్పందించి హుస్సేన్ ఆచూకీపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అని చెప్పుకొంటూ అక్రమ నిర్బంధాలు, అరెస్టులు చే యడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. ప్రజా సంఘాల లేఖను ఎక్స్‌లో పోస్టు చేశారు.