ఏపీ ప్రభుత్వం భారీ వ్యయంతో చేపట్టిన జీబీ (గోదావరి-బనకచర్ల) లింక్ వెనక భారీ కుట్ర దాగి ఉన్నదా? తెలంగాణకు ప్రాణాధారమైన ప్రాణహిత జలాలను కొల్లగొట్టేందుకే ఆ ప్రాజెక్టా? సంవత్సరంలో 300 రోజులపాటు సజీవంగా ఉండే ప్రాణహిత నీళ్లను ఎలాంటి అడ్డంకులు లేకుండా తరలించుకుపోవడానికి ఏపీ ప్రయత్నిస్తున్నదా? తెలంగాణకు సంబంధించిన కొందరు దాని ప్రయత్నాలకు సహకారం అందిస్తున్నారా? తనవంతుగా కేంద్రం కూడా వత్తాసు పలుకుతున్నదా?
సాగునీటి రంగ నిపుణులు ప్రస్తుతం ఈ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రతిపాదనలపై కేంద్రం వేగంగా చర్యలు చేపట్టడం, మరోవైపు కాళేశ్వరం రిపోర్టులో, ఇతర ప్రాజెక్టులకు అనుమతుల మంజూరులో తాత్సారం చేయడమూ అందుకు బలాన్ని చేకూర్చుతున్నది. గోదావరి ప్రాజెక్టులపై ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు చేసిన కుట్రలనే నేడు మరోసారి అమలుకు పూనుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
GB Link Project | హైదరాబాద్, జనవరి17 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.80 వేల కోట్ల భారీ అంచనా వ్యయంతో జీబీ లింక్ (గోదావరి-బనకచర్ల) ప్రాజెక్టును చేపట్టింది. కేవలం ఈ లింక్ ద్వారానే రోజుకు 2 టీఎంసీలను ప్రకాశం బరాజ్, బొల్లపల్లి రిజర్వాయర్ మీదుగా బనకచర్లలో వేసి పెన్నా బేసిన్‌కు మొత్తంగా 200 టీఎంసీలను తరలించాలనేది దాని లక్ష్యం. ఇంతభారీ ప్రాజెక్టు సక్సెస్ కావాలంటే ఏడాదిలో అత్యధిక రోజులు జలాలు అందుబాటులో ఉండాలి.
మరోవైపు ప్రధాన గోదావరిలో వరద ప్రవాహ రోజులు ఏడాది మొత్తంలో 70 రోజులకు మించి లేవు. మరీ ఈ జీబీ లింక్ ఏ విధంగా విజయవంతమవుతుంది? ఎందుకు చేపడుతున్నారు? ఏ భరోసాతో అంతమొత్తం వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు? ఇందులోనే ఉంది అసలు మతలబు! ప్రాణహిత, ఇంద్రావతి జలాలను గంపగుత్తగా కొల్లగొట్టాలనే భారీ కుట్ర జీబీ లింక్ వెనుక దాగి ఉన్నదని నీటిపారుదల రంగ నిపుణులు ఘంటాపథంగా చెప్తున్నారు. తమ వాదనలకు బలం చేకూరే అనేక అంశాలను ఉదహరిస్తున్నారు.
గోదావరి నది పరీవాహక ప్రాంతాన్ని మొత్తంగా 12 సబ్ బేసిన్లుగా విభజించారు. అందులో 8 సబ్బేసిన్ల నుంచి గోదావరికి వచ్చే మొత్తం జలాలు 31.95 శాతం. ఇక జీ9 లోని ఒక్క ప్రాణహిత సబ్‌బేసిన్ నుంచే 26 శాతం జలాలు గోదావరిలోకి చేరుతాయి. అంటే ప్రాణహితలో ఏమేరకు జలాలు అందుబాటులో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత జీ10 సబ్‌బేసిన్ అయిన లోయర్ గోదావరి అంటే ఎస్సారెస్సీ నుంచి పోలవరం వరకు మధ్య గోదావరిలో వచ్చిచేరే జలాలు 7.19శాతం, జీ11 సబ్బేసిన్లోని ఇంద్రావతి నుంచి 22.93శాతం జలాలు గోదావరికి వస్తాయి.
సూటిగా చెప్పాలంటే గోదావరి నీటిలభ్యతలో ప్రాణహిత, ఇంద్రావతిల జలాలే 48.93శాతం. ఇక ఇంద్రావతి జలాలను అటు ఒడిశా, ఇటు ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు కూడా వాటా మేరకు వినియోగించుకుంటున్నాయి. ప్రస్తుతం ఒక్క ప్రాణహిత నుంచే నికరంగా జలాలు గోదావరికి వచ్చిచేరుతున్నాయి. ఇక ప్రాణహితలో ఏడాదిలో 300రోజుల పాటు కనీస వరద ప్రవాహాలు కొనసాగుతుంటాయి.
ఏ సబ్‌బేసిన్‌లో వరద ప్రవాహం మొదలు కాకముందే అంటే వర్షాకాలం ప్రారంభంలోనే ఈ బేసిన్ నుంచి వరద ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రాణహిత జలాల భరోసాతోనే ఏపీ సర్కారు అంత భారీ వ్యయంతో జీబీ లింక్‌కు పూనుకున్నదని నీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాణహిత నీళ్లు నిరాటంకంగా అందడంపైనే జీబీ లింక్ సాఫల్యత ఆధారపడి ఉంటుందని గణాంకాలతో వారు సహా వివరిస్తున్నారు. దీని ద్వారా దిగువన ఇంద్రావతి జలాలను సైతం చెరబట్టేందుకు వీలవుతుందని చెప్తున్నారు.
ఏపీ పన్నాగాలకు కేంద్ర సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తున్నదని నీటిరంగనిపుణులు వివరిస్తున్నారు. అందుకు తెలంగాణకు చెందిన పలువురు సైతం లోపాయికారీగా సహకరిస్తున్నారని వారంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాణహిత జలాలను ఆధారంగా తెలంగాణ నిర్మించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక విధాలుగా అక్కసు వెళ్లగక్కారనీ.. అశాస్త్రీయ, అడ్డగోలు వాదనలతో తప్పుడు ప్రచారాలకు తెరలేపారని వారు స్పష్టంచేస్తున్నారు. ఒక్క మేడిగడ్డ బరాజ్‌లో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపాన్ని బూచిగా చూపి మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టునే కాటగలిపేందుకు ఎత్తులు వేస్తున్నారని ఇరిగేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాంకేతిక పరీక్షలు, ఎన్డీఎస్ఏ పేరిట ప్రాజెక్టుపై అపోహలను సృష్టిస్తూ, నిరుపయోగమనే వాదనలు ప్రచారం చేస్తూ తెలంగాణ గొంతు నులిమే కుట్రలను అమలు చేస్తున్నారని వివరిస్తున్నారు. వాస్తవంగా ప్రాణహిత జలాలు యథేచ్ఛగా దిగువకు.. అంటే ఏపీకి వెళ్లాలనేదే అసలు ఉద్దేశమని, దానికోసమే కాళేశ్వరాన్ని కాటగలిపేందుకు ప్రయత్నించారని మేధావులు విశ్లేషిస్తున్నారు. కాళేశ్వరం ఘటన జరిగిన నాటినుంచి నేటివరకు కేంద్రం వ్యవహరిస్తున్న తీరు కూడా ఆ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నది.
అదీగాక ఇటీవల కాళేశ్వరం 3వ టీఎంసీకి సంబంధించి అనుమతులు ఇవ్వకుండా డీపీఆర్‌ను తిప్పిపంపడం వెనుక కూడా ఇందులో భాగమై ఉండొచ్చునన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును సైతం నీటిపారుదల రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. పొరుగు రాష్ట్రం కుట్రలను అర్థం చేసుకోకుండా.. ప్రాణహితపై కాళేశ్వరం నిర్మాణ నేపథ్యాన్ని అవగతం చేసుకోకుండా ముందుకుపోతున్నదని వారంటున్నారు. ప్రాజెక్టును పునరుద్ధరించి, ప్రాణహిత జలాలను ఒడిసిపట్టకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని, కాళేశ్వరాన్ని కాటగలపడం అంటే ఏపీ నీటి కుట్రలకు పరోక్షంగా సహకరించడమేనని ఇరిగేషన్ నిపుణులు మండిపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం బరాజ్లుగానే పరిగణిస్తూ, ఏపీ ప్రణాళికలకు అనుగుణంగా అడుగులేయడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గోదావరిలో నీటిలభ్యత ప్రధానంగా ప్రాణహిత, ఇంద్రావతి నుంచే అధిక ప్రవాహాలు ఉంటాయనేది గణాంకాలే సూటిగా తేటతెల్లం చేస్తున్నాయి. ఆ రెండు ప్రధాన ఉపనదులు కలిసిన తర్వాత ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణ బీడు భూములను గోదారమ్మ పావనం చేస్తుంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాలపాటు జరిగిన తతంగం అందుకు భిన్నం. గోదావరి ప్రవాహం దిగువకు వెళ్లేదారిలో ఎక్కడా ఏ చిన్న ఆటంకం కలగకుండా సమైక్య పాలకులు తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించడం గమనార్హం. గోదావరి అత్యధిక దూరం తెలంగాణలోనే ప్రవహిస్తున్నా, ప్రాణహిత లాంటి నీటిలభ్యత ఉన్న నది వచ్చి చేరుతున్నా తెలంగాణ కట్టిన ప్రాజెక్టులు మాత్రం ఆ నీటిని ఒడిసిపట్టేలా నిర్మించలేదు. ధవళేశ్వరం దాకా గోదావరి ఆగకుండా పరుగులు తీయాలనే కుతంత్రాన్ని వారంతా అమలు చేశారు.
అందులో భాగంగానే ఉమ్మడి ఏపీ ఏర్పడేనాటికి గోదావరి జలాల వినియోగానికి సంకల్పించిన, అప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో ఒప్పందాలు పూర్తయ్యి అంతరాష్ట్ర సమస్యలు కూడా పెద్దగా లేని తెలంగాణ చారిత్రక ప్రాజెక్టుల గొంతు సైతం నులిమారు. 350 టీఎంసీల వినియోగానికి రూపకల్పన చేసిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టును 126టీఎంసీలకు కుదించి ఎందుకూ కొరగాకుండా చేశారు. 300 టీఎంసీల వినియోగానికి ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు, దానికి అదనంగా 100 టీఎంసీలతో ప్రతిపాదించిన కంతనపల్లి ప్రాజెక్టులకు పాతరేశారు. చెరువులను ఖతం పట్టించారు.
తెలంగాణవాదుల అలుపెరుగని పోరాటాల నేపథ్యంలో కంటితుడుపుగా పలు ప్రాజెక్టులను చేపట్టారు. అవి ఎక్కడా అంటే నీటిలభ్యత లేనిచోట! అంటే పుష్కలంగా నీరున్న ప్రాణహిత, ఇంద్రావతి సబ్బేసిన్లను వదిలి నీరు అంతగా లభించని మంజీరా (జీ4), మధ్యగోదావరి (జీ5), మానేరు (జీ6)పై ఆధారం చేసుకునే ప్రాజెక్టులను నిర్మించారు. ఎగువనుంచి వరద తక్కువైందని తెలిసినా శ్రీరాంసాగర్‌ను ఆధారం చేసుకుని వరద కాలువ.. దాని దిగువన ప్రధాన గోదావరిపై ఎల్లంపల్లి ప్రాజెక్టు, కడెంపై మరో ప్రాజెక్టు, గుత్ప, అలీసాగర్ వంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు.
అదీగాక ఆయా ప్రాజెక్టుల నిర్మాణంలో దశాబ్దాల తరబడి కాలయాపన! వెరసి పేరుకే ప్రాజెక్టులే తప్ప వాటితో తెలంగాణ దక్కిన ఫలితం శూన్యం. కాగితాలపై ఆయకట్టును చూపుతూ ఉమ్మడిపాలకులు ఏళ్లుగా కనికట్టు చేస్తూ కట్టిపడేశారు. సూటిగా తెలంగాణ ఏర్పడేనాటికి గోదావరిపై ఉన్న ప్రాజెక్టులతో ఏటా నికరంగా 100టీఎంసీల జలాలు వాడుకున్న దాఖలాలు లేవంటే ఉమ్మడిపాలకుల కుట్రను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ప్రాణహిత జలాలను తెలంగాణకు దక్కకుండా చేసే కుట్రలకు ఏపీ తెరలేపిందని నీటిరంగ నిపుణులు తెలుపుతున్నారు.
తెలంగాణ ఉద్యమనేతగా కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి అంగులంపైనా పూర్తి అవగాహన పెంచుకున్నారు. గోదావరి, కృష్ణా నదీవ్యవస్థనే కాదు సాగునీటి రంగాన్ని ఆవాహన చేసుకున్నారు. నీళ్లు లేని చోట ప్రాజెక్టులు నిర్మించిన ఉమ్మడి పాలకుల కుట్రలను పసిగట్టి గర్జించారు. కుటిల పన్నాగాలను తెలంగాణ జనానికి బట్టబయలు చేశారు. అందుకే స్వరాష్ట్ర ఏర్పాటు తరువాత అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాణహిత జలాలను ఒడిసిపట్టడమే ప్రధా న లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఏడాదిలో 300 రోజులు నీళ్లుండే ప్రాణహితను ఆధారంగా చేసుకుని బరాజ్‌లను నిర్మించారు.
ఇంద్రావతి జలాల వినియోగానికి అటు దేవాదుల ఆయకట్టుకు భరోసా కల్పించేందుకు సమ్మక్కసాగర్ బరాజ్‌ను నిర్మించారు. దాని దిగువన 60 టీఎంసీల సామర్థ్యంతో సీతమ్మసాగర్కు శ్రీకారం చుట్టారు. సూటిగా చెప్పాలంటే ప్రాణహిత, ఇంద్రావతి నదుల నీటిని ఒడిసిపట్టి, ఎగువన నీళ్లు లేని ప్రాజెక్టులకు తరలించి గోదావరిని నిరంతర సజీవనదిగా మార్చారు. తెలంగాణను పంటలతో పచ్చ గా మార్చే లక్ష్యంతో ముందుకుసాగారు. సుదీర్ఘ మేధోమథనం సాగించి కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి అత్యంత స్వల్పకాలంలో పూర్తిచేశారు.
ఉమ్మడిపాలకులు సృష్టించిన శతకోటి సమస్యలకు కాళేశ్వరం ద్వారా ఒకే ఒక్క బలమైన పరిష్కారాన్ని చూపారు. పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు భరోసానివ్వడమేగాక కొత్త ఆయకట్టుకు కాళేశ్వరం నేటికీ పు రుడుపోస్తున్నది. కాళేశ్వరంతో తెలంగాణలోని సా గునీటిరంగ ముఖచిత్రమే మారిపోయింది. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే గోదావరిలో మన 954 టీఎంసీల్లో 450 టీఎంసీలకు పైగా తెలంగాణ వినియోగించుకునేందుకు మార్గం సుగమమైంది. ఎగువ నుంచి వరద వచ్చినా, రాకున్నా ఎల్లంపల్లికి ఢోకా లేకుండాపోయింది.
శ్రీరాంసాగర్ జలాశయానికి ఏడాది పొడవునా జలకళ. దైవాధీనంగా మానేరుపై నిర్మించిన ఎగువ, మధ్య, దిగు వ మానేరుకు కాళేశ్వర గంగ శాశ్వత భరోసా కల్పించింది. మంజీరా ముఖం చాటేసినా, సింగూరుకు కాళేశ్వరం ఊపిరులూదింది. ఆయకట్టుకు మోక్షం లభించింది. హల్దీ వాగుద్వారా చారిత్రక నిజాంసాగర్‌కు ప్రాణహిత జలాలతో ప్రాణం పోస్తున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రగతి కాళేశ్వరానికి ముందు, ఆ తరువాత అనే నిర్వచించవచ్చు.
సమ్మక్కసాగర్తో దేవాదులకు భరోసా ల భించింది. సీతారామ పూర్తయితే గోదావరిలో తెలంగాణ తన వాటాను పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలను రూపొందించి అమలు చేశారు. అందుకు నేడు గత ప్రాజెక్టుల కింద సాగవుతున్న ఆయకట్టు, వస్తున్న పంటల ఉత్పత్తే సజీవ సాక్ష్యం. ఇప్పటికే అనేక రికార్డులను తిరగరాసిన కాళేశ్వరం భవిష్యత్‌లో జీవనరేఖగా నిలువనుంద ని ఇంజినీరింగ్ నిపుణులు, మేధావులు చెబుతున్న మాట. అంతటి ప్రాధాన్యమున్న కాళేశ్వరాన్ని కాటగలిపే కుట్రల వెనుక.. పొరుగు రాష్ర్టానికి సహకరిం చే ఎత్తుగడ కూడా ఉన్నదా అనే అనుమానాలు జీబీ లింక్ నేపథ్యంలో వ్యక్తమవుతున్నాయి.