హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విత్తన ఎగుమతి ప్రాజెక్టు విజయవంతమైందని జర్మనీ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ ష్రోడర్, ఆ ప్రాజెక్టు అనుసంధాన కర్త, వేములవాడ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్ ప్రశంసించారు. ఉద్యమ నేత కే చంద్ర శేఖర్‌రావు నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి దాదాపు పదేం డ్ల పాటు తెలంగాణలో వ్యవసాయ, విత్తనాభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యమివ్వడమే ఇందుకు కారణమని అభినందించారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఈ నెల 17 నుంచి జరుగుతున్న ప్రపంచ ఆహార, వ్యవసాయ సదస్సులో భాగంగా శుక్రవారం ప్రపపంచ దేశాల మధ్య సహకారానికి తోడ్పడే విధానాలపై ప్రధాన చర్చ జరిగింది. సుస్థిర వ్యవసాయాన్ని, ఆహార సార్వభౌమత్వాన్ని, సరఫరా గొలుసులను ప్రోత్సహించడం, ఆహార నష్టాన్ని, ఆహార వ్యర్ధాలను తగ్గించడం తదితర అంశాలపై ఈ సదస్సులో ప్రముఖంగా చర్చించారు.