హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన బయోటెక్నాలజీ శాస్త్రవేత్త బుట్టి రమేశ్‌కు అరుదైన అవకాశం లభించింది. రెనల్ సెల్ కార్సినోమా (మూత్రపిండ క్యాన్సర్) ప్రాజెక్టులో భాగంగా ఆయన అమెరికన్ ఆర్మీ మెడికల్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌తో కలిసి పరిశోధనలు చేయనున్నారు. వరంగల్ జిల్లాలోని గువిచెర్లకు చెందిన రమేశ్ బయోటెక్నాలజీలో హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందాక సీఎస్ఐఆర్ ఫెలోషిప్‌ను సాధించారు.
బ్రెస్ట్ ట్యూమర్‌పై పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్‌కు చెందిన ప్రముఖ బయాలజిస్టు గోపాల్ కుందు సారథ్యంలో అధ్యయనం చేసిన రమేశ్ 2020లో డాక్టరేట్‌ను పొందారు. ఆ తర్వాత ఆయన సౌత్‌వెస్ట్రన్ మెడికల్ సెంటర్లోని ల్యాబోరేటరీ ఆఫ్ జేమ్స్ బ్రూగారోలాస్లో శాస్త్రవేత్తగా సేవలు అందించడంతోపాటు కిడ్నీ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. బయోటెక్నాలజీ రంగంలో విశిష్ట సేవలు అందిస్తుండటంతో రమేశ్‌కు ప్రతిష్ఠాత్మక యూఎస్ ఆర్మీ మెడికల్ రిసెర్చ్ సెంటర్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించింది.