హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సమ్మేటివ్ పరీక్షల జవాబుపత్రాలను ఎక్స్టర్నల్ వాల్యుయేషన్ చేయించాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో అదే స్కూల్ టీచర్ల చేత పేపర్లు దిద్దే విధానానికి స్వస్తి చెప్పింది. సమ్మేటివ్ -1, సమ్మేటివ్ -2 పరీక్షల జవాబుపత్రాలను సొంత స్కూళ్లో.. పాఠశాల ఉపాధ్యాయుల చేత కాకుండా ఇతర స్కూళ్ల టీచర్ల చేత మూల్యాంకనం చేయించాలని ఆదేశాలిచ్చింది. 3-5 రోజుల్లో మూల్యాంకనం పూర్తిచేయాలని, ప్రాథమిక స్థాయిలో ఒక్కో పేపర్‌కు రూ.2, హైస్కూల్ స్థాయిలో రూ. 3చొప్పున పారితోషికంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. మండలానికి రూ. 10వేల చొప్పున మూల్యాంకన శిబిరాల నిర్వహణకు కేటాయించింది.
ఎక్స్టర్నల్ మూల్యాంకనాన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది నిరంతర సమగ్ర మూల్యాంకనం ఉనికికి ప్రమాదమని సంఘం రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు వోడ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య ఆదివారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. ఏకపక్షంగా ఇలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం శోచనీయమని తెలిపారు. విద్యాశాఖ ఉత్తర్వుల్లో శాస్త్రీయత లేదని, దీనిపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని అభిప్రాయపడ్డారు. దీనిపై చర్చ జరుపాలని డిమాండ్ చేశారు.