గజ్వేల్/తొగుట, ఏప్రిల్ 2: తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయని మహారాష్ట్ర రైతు సంఘం నేతలు హర్షం వ్యక్తంచేశారు. దేశంలోనే రైతుల కోసం ఆలోచించిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులను అక్కున చేర్చుకొని వారికి అండగా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎర్రటి ఎండల్లోనూ కాలువలు, వాగుల్లో పుష్కలంగా నీళ్లను చూస్తే సముద్రమే నడిచొచ్చినట్టుందని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఏప్రిల్ నెలలోనే తమ వద్ద తాగునీళ్లు లేక చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందిపడుతుంటే, ఇక్కడ రోజుకు రెండుసార్లు ఇంటింటికీ నీళ్లు ఇవ్వడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. కార్పొరేట్ భవనంలా కనిపించే వ్యవసాయ మార్కెట్లలో మంచి సౌలత్లున్నాయని ప్రశంసించారు. ఇక్కడి ప్రజల సంతోషం వెనుక సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు.
దేశానికి తెలంగాణ మాడల్ అవసరం
ఇప్పుడు దేశానికి తెలంగాణ మాడల్ అవసరం. తెలంగాణ పథకాలు తమకూ కావాలని దేశవ్యాప్తంగా రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు. తెలంగాణ రాకముందు మా రాష్ట్రంలో కంటే ఇక్కడే రైతు ఆత్మహత్యలు అధికంగా ఉండేవి. ఇప్పుడు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు అనే మాటే వినిపించడం లేదు. ఎక్కడ చూసినా పుష్కలంగా నీళ్లున్నాయి. తెలంగాణ అభివృద్ధిని చూస్తుంటే నా కడుపు నిండింది. కేసీఆర్ సర్కార్ దేశంలో రావాలన్నదే మహారాష్ట్ర ప్రజల కోరిక.
-మాణిక్‌రావు కదం, బీఆర్ఎస్ కిసాన్‌సెల్ అధ్యక్షుడు, మహారాష్ట్ర
నీళ్లు చూస్తే సంబురంగా ఉంది
మా రాష్ట్రంలో పుట్టిన గోదావరి జలాలను తెలంగాణలోని కాలువలు, వాగుల్లో చూస్తే సంబురంగా ఉంది. ఎర్రటి ఎండల్లోనూ నీళ్లు ఇక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. దేశానికి అన్నంపెట్టే రైతులు బాగుండాలనే కేసీఆర్ సంకల్పం చాలా గొప్పది. దేశవ్యాప్తంగా తెలంగాణ మాడల్ అమలు చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు ఇంతకన్నా మంచిచేసే నాయకుడు ఎవరుంటారు? మాకు కేసీఆర్ సర్కార్ కావాలి.
-భగవాన్దాదా పాటిల్, రైతు సంఘం నేత మహారాష్ట్ర
తాగేందుకే నీళ్లు లేవు
ఏప్రిల్ మొదట్లోనే మా వద్ద తాగేందుకు నీళ్లు దొరకడం లేదు. కానీ తెలంగాణలో కేసీఆర్ సాగునీటితోపాటు రోజూ తాగేందుకు నీళ్లిస్తుండు. ఇంతకంటే ఇంకేం కావాలి. తెలంగాణ పథకాలు చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి. బస్సులో వస్తుంటే రోడ్డు పక్కనే నిండుగా పారుతున్న కాలువలు కనిపించాయి. ఇవే మన గోదావరి నీళ్లు అని పక్కనే ఉన్న స్నేహితుడికి చూపించా.
-వాసుముఖ్త, రైతు నేత, చంద్రాపూర్, మహారాష్ట్ర
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. రైతుల కోసం నిర్మించిన ప్రాజెక్టులను చూసేందుకు వచ్చాం. రైతు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో మృతిచెందిన రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ సాయం చేయడం గొప్ప విషయం. కేసీఆర్‌ను మిగతా సీఎంలు స్ఫూర్తిగా తీసుకోవాలి. కేవలం మూడున్నర ఏండ్లలో ఇంతపెద్ద మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించడం, 200 కిలోమీటర్ల దూరం నుంచి ఇంత ఎత్తుకు నీళ్లను తీసుకురావడం మామూలు విషయం కాదు. 100 మీటర్ల లోతు నుంచి పంప్‌ల ద్వారా నీరు బయటకు పంపించడం చాలా గొప్ప విషయం. సీఎం కేసీఆర్ రైతుల కోసం చేస్తున్న కృషి మరిచిపోలేనిది.
– సుధీర్ బింధు, మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సెల్ యూత్ అధ్యక్షుడు
తెలంగాణ రైతులు అదృష్టవంతులు
తెలంగాణ రైతులు నిజంగా అదృష్టవంతులు. తెలంగాణలో భారీ ప్రాజెక్టులను కట్టి.. సాగునీటిని అందిస్తూ పండిన పంటను కూడా కొంటున్నారు. ఇది రైతులపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమకు నిదర్శనంలా కనిపిస్తున్నది. ప్రతిరైతూ ఆనందంగా ఉండాలంటే దేశంలో కేసీఆర్ సర్కార్ రావాలి.
-నారాయణ్ శిరిరంగ్ విభూతి, రైతు సంఘం నేత, మహారాష్ట్ర
మహారాష్ట్రకు కేసీఆర్ కావాలి
సీఎం కేసీఆర్ లాంటి నాయకుడి అవసరం మహారాష్ట్రకు ఉంది. ఈ సారి కిసాన్ సర్కారే అధికారంలోకి వస్తుంది. గజ్వేల్‌లోని సమీకృత మార్కెట్ లాంటిది ఎక్కడా చూడలేదు.
– పవన్, మహారాష్ట్ర రైతు నాయకుడు